
వ్యవసాయం మన రాష్ట్రంలో ప్రధాన రంగం.. తరాలతరబడి వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. పాత పద్దతుల్లో సాగుతున్న వ్యవసాయం నష్టాలబారిన పడేస్తోంది. అందుకే ఏపీలో సాగును సాంకేతిక మయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇక ప్రతి గ్రామంలోనూ ఓ భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సీఎం వైయస్ జగన్‌తో సమీక్ష ముగిసిన అనంతరం మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారని వివరించారు. వైయస్ఆర్ ఆగ్రి ల్యాబ్‌లను మూడు దశల్లో ఏర్పాటు చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఒకటి జిల్లా స్థాయిలో, రెండోది నియోజకవర్గస్థాయిలో, మూడు గ్రామస్థాయిలో కూడా భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన నమూనాను సీఎం పరిశీలించారు.
విత్తన ఉత్పత్తిలో రైతులను ప్రోత్సహించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. విత్తనాలు పండించడానికి ముందుకు వచ్చిన రైతులతో ఏపీ సీడ్స్ ఎంఓయూ కుదుర్చుకుంటుంది. విత్తనాలను రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రోసెసింగ్ చేసిన తరువాత అందజేస్తాం. దీని వల్ల రైతులకు అధిక ఆదాయం, నాణ్యమైన విత్తనాలు అందించగలుగుతాం. రాష్ట్రంలోని ప్రతి పంట ఈ–క్రాపు బుకింగ్‌లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.
ఏ సర్వే నంబర్లో ఏ పంట వేశారనేది అందుబాటులో తీసుకురావాలని, ఈ–క్రాపు బుకింగ్ చేస్తే మార్కెటింగ్‌ను పటిష్టం చేయగలుగుతాం.. రైతులకు ఇబ్బందులు వస్తే అధిగమించగలుగుతామని సీఎం చెప్పారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు ట్యాబ్ లేదా స్మార్ట్‌ఫోన్ ఇవ్వాలని, అవసరమైన టెక్నాలజీ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. వైయస్ఆర్ ఉచిత పంట బీమా పథకాన్ని ప్రారంభించాం. రైతులు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉచిత పంట బీమా పథకం బ్రహ్మాండంగా ఆదరణ పొందింది.