తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉధృత రూపం దాల్చుతోంది. ఓ వైపు ప్రభుత్వం.. మరోవైపు కార్మికుల జేఏసీ పట్టువదలని విక్రమార్కుల్లా పంతానికి పోతున్నారు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఏమీ లేవని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు వివరించింది. దీంతో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ సునీల్ శర్మ హైకోర్టులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలన్నీ ఇప్పటికే చెల్లించేశామనీ.. పైగా 622కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చామని రెండు రోజుల క్రితమే రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అయితే హైకోర్టు మరో సమస్యను లేవనెత్తింది. బకాయిలు ఇచ్చేశారని చెబుతున్నారే గానీ.. అందుకు సంంబంధించిన లెక్కలు సరిగా లేవనే విషయాన్ని హైకోర్టు లేవనెత్తింది. మిగిలిన బకాయిలపై వివరణ కోరింది. అంతేకాదు అసలు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇంకా ఏమైనా ఉన్నాయో లేదో చెప్పాలని ఆర్టీసీ ఎండీని కోరింది. దీంతో ఆర్టీసీ ఎండీ ఇంఛార్జ్ ఎండీ కౌంటర్ దాఖలు చేయగా.. అందులో ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదనే విషయం తేటతెల్లమయింది.
2018–19 సంవత్సరానికి గాను రాయితీలు 644 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించేసిందని స్పష్టం మయింది. ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్ల సాయం అందించలేమని ప్రభుత్వం అక్టోబర్ 30న లేఖ రాసిందని పేర్కొన్నారు. నగరంలో బస్సులు నడుపుతున్నందు వల్ల జీహెచ్‌ఎంసీ రెండేళ్లల్లో రూ.336 కోట్లు చెల్లించింది. అదే 2016–2017లో ఆర్టీసీకి డబ్బులివ్వలేమని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ చెప్పింది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేనపుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చెల్లించేందుకు కుదరకపోవడంతో ఆర్టీసీ చేతులెత్తేసింది. సమ్మె ఆరంభమైన అక్టోబర్5 నుంచి అక్టోబర్30 నాటికి రూ.78 కోట్లు ఆదాయం వస్తే రూ.160 కోట్లు ఖర్చు అయింది. దీంతో రూ.82 కోట్లు నష్టం వచ్చింది.
సాధారణంగా ఖర్చుల నిర్వహణలో అధికభాగం డీజిల్ కే అవుతుంది. దేశంలో వ్యాప్తంగా చూస్తే పొరుగు రాష్ట్రాలు ఆర్టీసీలకు ఆర్థికంగా సాయం చేయడం లేదు. ప్రైవేటు బస్సులు లాభాల్లో ఉంటే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ప్రజల కోసం బస్సుల్ని నడుపుతున్నామని ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ లో పొందుపరిచింది.