
విశాఖ లో ఇసుక సమస్యపై లాంగ్ మార్చ్ చేపట్టనున్న జనసేనకు మద్దతుగా కేవలం తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు జనసేనతో కలిసి పోటీ చేశాయి. ఈ రెండు పార్టీల కార్యదర్శలు లాంగ్ మార్చ్‌కు రావడం లేదని కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పేశాయి. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా హాజరుకాలేమని చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
సో.. ఇక మిగిలింది పవన్, చంద్రబాబు.. వీరిద్దరూ కలిసి విశాఖ వీధుల్లో మార్చ్ చేయడానికి చూస్తున్నారు. పవన్ కార్యక్రమానికి టీడీపీ నేతలు జనసమీకరణకు సన్నాహాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గుంటూరులో సొంత పుత్రుడు లోకేష్‌తో నాలుగు గంటల దీక్ష చేయిస్తే.. విశాఖలో దత్తపుత్రుడు పవన్‌తో లాంగ్ మార్చ్ చేయిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. లాంగ్ మార్చ్ కొత్తగా చేసేది ఏమీ లేదని, బాబుతో కలిసి ఐదేళ్లుగా పవన్ లాంగ్‌మార్చ్ చేస్తూనే ఉన్నాడన్నారు.
ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ మాత్రం సంతోషంగా ఉన్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయం చేయడానికి ఒక పాయింట్ దొరికిందని, ఏదో విధంగా బురదజల్లవచ్చని వారు ఆనందపడుతున్నారని చెప్పారు. ‘గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి మొదలుకొని కుంధూ వరకు నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి.
ఎక్కడ చూసినా రాష్ట్రం ఆకుపచ్చగా కళకళలాడుతూ కనిపిస్తుంది. చివరకు కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతపురం కూడా వరదలను చూసింది. ఒక పక్క ఈ పరిస్థితులు చాలా సంతృప్తికరంగా ఉన్నా.. మరోవైపు దీని వల్ల ఇసుక కొరత ఏర్పడింది.వరదలు ఎప్పుడైతే తగ్గుతాయో.. తగ్గిన వెంటనే ఏ విధంగా ఇసుకను తీయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం పనిచేస్తోంది. సీఎం వైయస్ జగన్ దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేశారు. మరి వరద ఉంటే ఇసుక ఎలా తీస్తారో లక్షల పుస్తకాలు చదివిన మేధావి, ఆయనకు వంతపాడే అనుభవజ్ఞాని చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు.