మహారాష్ట్రలో
బిజెపికి గట్టి షాక్ తగిలింది. ప్రభుత్వం ఏర్పాటులో మాజీ సిఎం ఫడ్నవీస్
చేతులెత్తేశారు. సంఖ్యాబలం రీత్యా అతిపెద్ద పార్టీగా అవతిరించినా ప్రభుత్వం
ఏర్పాటుకు అవసరమైన బలం లేకపోవటంతో చేసేది లేక పార్టీ చతికిలపడింది. కేంద్రంలో
అధికారంలో ఉన్నామన్న ఏకైక కారణంతో కొన్ని రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్రలో మాత్రం సాధ్యం కాలేదు.
288 సీట్లకు మొన్న జరిగిన ఎన్నికల్లో బిజెపి+శివసేన ఒక కూటమిగా పోటిచేశాయి. అదే విధంగా కాంగ్రెస్+ఎన్సీపీ ఓ జట్టుగా ఉన్నాయి. ఇందులో బిజెపికి 105 సీట్లు, శివసేనకు 64 సీట్లొచ్చాయి. అదే విధంగా ఎన్సీపి 54 నియోజకవర్గాల్లో గెలిస్తే కాంగ్రెస్ 44 సీట్లలో గెలిచింది. సహజంగానే బిజెపి+శివసేన కూటమికే అధికారం దక్కాలి. కానీ ముఖ్యమంత్రి పీఠం తమకే దక్కాలని అనూహ్యంగా శివసేన డిమాండ్ మొదలుపెట్టేసరికి బిజెపికి షాక్ కొట్టినట్లైంది.
సిఎం కుర్చీని వదులుకునేది లేదన్న పట్టుదలతో బిజెపి శివసేనకు నచ్చ చెప్పేందుకు చాలా ప్రయత్నాలే చేసినా సాధ్యం కాలేదు. రెండు పార్టీలు కూడా దేనికదే పట్టుదలకు పోవటంతో చివరకు రెండుపార్టీలు విడిపోయాయి. దాంతో శివసేన ఎన్సీపీ+కాంగ్రెస్ కూటమితో చేతులు కలుపుతోంది. ఇదే అదునుగా శివసేన గనుక ఎన్డీఏ నుండి బయటకు వచ్చేస్తే మద్దతు ఇవ్వటానికి అభ్యంతరం లేదని చెప్పింది ఎన్సీపి, కాంగ్రెస్ కూటమి.
దాంతో ఎన్సీపి, కాంగ్రెస్ డిమాండ్ చేసినట్లు ఎన్డీఏ నుండి శివసనే బయటకు రావటానికి రెడీ అయిపోతోంది. రేపటి ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపి మాత్రమే ఉంటాయి. కాంగ్రెస్ బయటనుండి మద్దతిస్తుంది. కాకపోతే స్పీకర్ పదవి మాత్రం కాంగ్రెస్ చేతికి ఇవ్వటానికి రెండు పార్టీలు అంగీకరించాయి. దాంతో ఆదిత్య ఠాక్రే మంత్రివర్గంలో శివసేన, ఎన్పీపి మంత్రులు మాత్రమే ఉంటారు. నిజానికి ఈ పరిణామాలు బిజెపి ఊహించలేదనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవటం షాక్ అనే చెప్పాలి.