టీడీపీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది అంటే...? ఆ పార్టీ కార్యకర్తల నుంచి ఎక్కువగా వినపడే సమాధానం ఒకటి ఉంటుంది. అధినేత భజన పరులకు ఎక్కువగా విలువ ఇవ్వడంతో పార్టీ ఓడిపోయింది అని చెప్తూ ఉంటారు. ఇతర కారణాలు ఎన్ని ఉన్నా సరే దీనిని ప్రధానంగా వారు ప్రస్తావిస్తూ ఉంటారు. రాజకీయంగా నేడు చంద్రబాబు ఇబ్బంది పడటానికి భజన పరులు కూడా ఒకరకంగా కారణమనే వాదనలు కూడా ఎక్కువగానే వినపడుతూ ఉంటాయి ఆ పార్టీలో.
మరి దాని నుంచి పార్టీ ఇప్పుడు బయటకు వచ్చిందా...? అంటే లేదనే సమాధానమే ఎక్కువగా వినపడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు తనకు భజన చేసే వాళ్ళను తెచ్చి పెట్టుకునే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. పది రోజుల క్రితం తూర్పు నియోజకవర్గంలో మాట్లాడిన చంద్రబాబు, పని చేసే వాళ్ళకే తన విలువ అని చెప్పారు. ఆ మాట చెప్పి పది రోజులు కూడా సరిగా అవ్వలేదు... ఇప్పుడు మళ్ళీ సిబిఎన్
ఆర్మీ అనే వ్యవస్థను తీసుకొస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో చంద్రబాబు పదే పదే
ఆర్మీ స్పూర్తితో పని చెయ్యాలని కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేసే వారు. ఇది చాలా మంది పార్టీ కార్యకర్తలకు ఎక్కడో కాలింది. ఆస్తులు పోగొట్టుకుని, ఆప్తులను పోగొట్టుకుని మేము పార్టీ కోసం పోరాడుతుంటే... కుర్ర కుంకల స్పూర్తితో మేము పని చేసేది ఏంటి...? అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు చంద్రబాబు మళ్ళీ వాళ్ళను పక్కకు తప్పించినట్టే తప్పించి సమీక్షా సమావేశాలకు పిలుస్తున్నారు.
ఎన్నికల తర్వాత వాళ్ళతో దిగిన ఫోటోనే ఒక అతి అనుకుంటే... ఇప్పుడు ఏకంగా సమీక్షా సమావేశాలు నిర్వహించడంపై సీనియర్ నేతలు, యువనేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఇంకా ఏం జరిగితే చంద్రబాబు మారతారు అంటూ ప్రశ్నిస్తున్నారు.