పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్న తరుణంలో.. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల అధిష్ఠానాలు ఎంపీలకు దిశానిర్దేశం చేశాయి. ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడాలని వైసీపీ ఎంపీలకు జగన్ స్పష్టం చేశారు. విభజన హామీలపై నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలకు కేటీఆర్ సూచించారు.


పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం, సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై వైసీపీ ఎంపీలకు ఏపీ సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సమావేశాల్లో గట్టిగా మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల సంగతి కూడా ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నారు. రామాయపట్నం పోర్టు, వైద్య కళాశాలల ఏర్పాటు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల కోసం పార్లమెంట్ లో ప్రశ్నిస్తామంటున్నారు వైసీపీ ఎంపీలు. ప్రత్యేక హోదా మొదటి ప్రాధాన్యాంశంగా పోరాడాలని జగన్ సూచించినట్టు ఎంపీలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు కాబట్టి.. నిధుల బాధ్యత కేంద్రానిదే అన్నారు జగన్. రాబోయే రోజుల్లో కాఫర్‌ డ్యాం పూర్తైతే తక్షణమే భూసేకరణ కోసం దాదాపు 10 వేల కోట్లు అవసరం అవుతాయనీ, అందువల్ల ఆ నిధుల కోసం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు సూచించారు. రెవెన్యూ లోటు భర్తీ, విభజన చట్టంలోని అన్ని అంశాలపై నిలదీస్తామన్నారు. 


విభజన హామీలు...రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం... కేంద్రంపై ఒత్తిడి  తీసుకురావాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. తెలంగాణ భవన్‌లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. అంశాల వారీగా పార్టీ వైఖరి ఉంటుందని, అంతిమంగా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్నారు కేటీఆర్‌. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు, నిధులు వంటి అంశాలపైన ఇప్పటి నుంచే  పనిచేయాలని సూచించారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణంపైనా చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు గణాంకాలతో అందించేలా కార్యాలయం నిర్మిస్తామని చెప్పారు కేటీఆర్. 



మరింత సమాచారం తెలుసుకోండి: