మెట్టు దిగని ప్రభుత్వం... బెట్టు వీడని కార్మిక సంఘం..! ఇదీ
తెలంగాణ ఆర్టీసీ ముఖచిత్రం. ఆందోళనలు నానాటికీ ఉద్ధృతం కావడంతో ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మరోవైపు 44వ రోజు
జేఏసీ నాయకుల అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆర్టీసీ కార్మిక సంఘాల
జేఏసీ కన్వీనర్
అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీఎన్ రెడ్డి నగర్‌లోని తన నివాసంలో అశ్వత్థామ స్వీయ నిర్బంధంలో ఉంటూ శనివారం నిరాహార దీక్షకు దిగారు. వరుసగా రెండో రోజూ దీక్ష కొనసాగిస్తుండటంతో ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లారు. ఈ క్రమంలో
జేఏసీ కన్వీనర్ నివాసం ముందు
ఆర్టీసీ కార్మికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
అశ్వత్థామ రెడ్డిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ..
ఆర్టీసీ కార్మికులు పోలీసులకు అడ్డం పడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు
ఆర్టీసీ కార్మికులు. కార్మికులు ప్రతిఘటించినప్పటికీ.. పోలీసులు బలవంతంగా అశ్వత్థామ రెడ్డిని వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్వీయ నిర్బంధంలో నిరాహార దీక్ష చేపట్టిన అశ్వత్థామ రెడ్డిని పరామర్శించేందుకు
బీజేపీ నేతలు
వివేక్, జితేందర్ రెడ్డి తదితరులు వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు.. ఉదయమే
ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి దీక్షను కూడా భగ్నం చేశారు పోలీసులు. ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి మరీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు హైకోర్టులో
ఆర్టీసీ అఫిడవిట్‌పై మండిపడింది టీ-కాంగ్రెస్. తెలంగాణలో సంక్షోభం వచ్చేలా ఉందని మండిపడ్డారు
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. కార్మికులు ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యారని.. ఐఏఎస్ అధికారులు హైకోర్టుకు అఫిడవిట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఆధారాలుంటే జైల్లో పెట్టాలని, లేకపోతే ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. అన్ని పార్టీలతో కలిసి సీఎం మీటింగ్ పెట్టాలని, ఆర్టీసీపై ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్నారు. మొత్తం మీద నేతల అరెస్టులతో
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో 44వ రోజు కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.