ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై 48 రోజులైంది. ఈ 48 రోజుల కాలంలో ఆర్టీసీ కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. డిపోల ముందు బైఠాయింపులు, రాస్తారోకో కార్యక్రమాలు, విద్యార్థి సంఘాలతో ర్యాలీలు, వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు. కార్మికుల సమ్మెపై హైకోర్టులో చాలా రోజులు వాదనలు జరిగాయి. చివరకు హైకోర్టు చర్చల కోసం ఆదేశాలు జారీ చేసే అధికారం తమకు లేదని తెలిపింది. 
 
లేబర్ కోర్టు రెండు వారాల్లోపు ఈ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. నిన్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆర్టీసీ వ్యవహారంపై ఉన్నతస్థాయి సమీక్ష చేసింది. గతంలో సీఎం కేసీఆర్ రెండుసార్లు ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆర్టీసీ కార్మికులు 48 రోజుల పాటు సమ్మె చేసి  ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు. 
 
48 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన ఉద్యోగాలు తిరిగి రావేమో అనే ఆందోళనలతో 29 మంది ఆర్టీసీ కార్మికులు మృతి చెందారు. ఇంతా చేసీ కార్మికులు ఏమైనా సాధించారా అంటే విలీనాన్ని గాల్లో కలిపేశారు. 
 
అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన నష్టపోయింది ప్రజలేనని ఆర్టీసీ కార్మికులు కొందరి మాటలు నమ్మి వారి స్వార్థానికి బలయ్యారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే మీ పరిస్థితి ఏమిటని ఆర్టీసీ కార్మికులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: