ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15మందికి తీవ్ర గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుండి వచ్చిన ఒక లారీ బస్సును ఢీ కొట్టింది. లారీ ఢీ కొట్టడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. మలికిపురం నుండి ఆర్టీసీ బస్సు వైజాగ్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఏపీ రవాణాశాఖా మంత్రి ఈ ఘటనపై స్పందిస్తూ ఈరోజు ఉదయం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. రాజోలు, కాకినాడ డిపో మేనేజర్లు సంఘటనా స్థలానికి చేరుకొని తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నారని పేర్ని నాని తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పరారయ్యాడు. లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీని పోలీసులు తిమ్మాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి పేర్ని నాని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పోలీసులు మలికిపురం నుండి వైజాగ్ వెళ్తున్న రాజోలు డిపోకు చెందిన బస్సును కాకినాడ నుండి సత్తుపల్లి వెళ్తున్న లారీ వెనుక నుండి ఢీ కొట్టిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే మంత్రి పేర్ని నాని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.