ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ బీజేపీతో సై అంటే సై అనేందుకే రెడీ అవుతోంది. ఆ పార్టీతో మెతక వైఖరి అవలంభిస్తే తమకే లాస్ అని వైసీపీ భావిస్తోంది. అందుకే కమలదళానికి గట్టిగా కౌంటర్లు ఇస్తోంది. మరోవైపు...మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బీజేపీ ఏపీలో ఏం చేస్తుందోననే ఆందోళన అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
బీజేపీ ఆపరేషన్ సౌత్ కొనసాగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కమలదళం ప్రధానంగా తన దృష్టినంతా దక్షిణాదిపైనే కేంద్రీకరించింది. ఇది తెలుగు రాష్ట్రాలపై మరింత ఎక్కువగానే ఉంది. ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన కీలక పరిణామాలే ఇందుకు నిదర్శనం. టీడీపీ నుంచి బలమైన...ప్రభావం చూపగల నేతలను తమ వైపు వచ్చేలా చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇప్పుడు బీజేపీ తన ఫోకస్‌ని వైసీపీ మీద కూడా పెట్టింది. ఏపీ బీజేపీ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
మరోవైపు...ఏపీ బీజేపీతో సంబంధం లేకుండానే ఢిల్లీలో తమ వ్యవహారాలను చక్కబెట్టుకోవాలని భావిస్తోంది వైసీపీ. బలవంతంగానైనా యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకునే అవకాశం కనిపి'స్తోంది. ఇటు మతపరమైన వ్యవహరాల్లో వైసీపీని టార్గెట్ చేసుకునే విషయంలో బీజేపీ మిగిలిన వారికంటే ముందు ఉంది. కొడాలి నాని ఎపిసోడ్ లో ఏకంగా కేసులు పెట్టే వరకు వెళ్లింది. దీంతో వైసీపీ కూడా కమలనాధులకు గట్టిగా కౌంటర్లు ఇస్తూ వస్తోంది.
ఇక...తాము బీజేపీకి భయపడటం లేదనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపించాల్సిన అవసరం ఉందని వైసీపీలో చర్చ మొదలైంది. అప్పట్లో సోనియాను...ఆ తర్వాత బీజేపీని ఎదిరించి రాజకీయం చేయటం వల్లే జనంలో జగన్‌కు హీరో వర్షిప్ వచ్చిందని వైసీపీ నేతల అభిప్రాయం. ఇప్పుడు బీజేపీ విషయంలో సాఫ్ట్‌గా ఉన్నామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే ఇమేజ్ డామేజ్ అవుతుందనే ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.
అయితే... పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్...పోలవరం లాంటి కీలక ప్రాజెక్టు విషయంలో పేచీలు లేకుండా చూసుకోవాలని కొంతమంది వైసీపీ నేతల అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్రంతో సఖ్యతతో ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. ఇక...మహారాష్ట్రలో బీజేపీ రాజకీయం చూశాక ఆ పార్టీని టార్గెట్ చేసుకునే విషయంలో వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుందనేదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.