నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్ళను తక్షణమే అదుపులో పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో తలనొప్పులు తప్పవు. మంత్రివర్గంలో ఎవరు ఏమి మాట్లాడినా అంతిమంగా జవాబు చెప్పుకోవాల్సింది మాత్రమే తానే అన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. నిజానికి మంత్రివర్గంలోని వాళ్ళల్లో ఎక్కువమంది జాగ్రత్తగా మాట్లాడే వాళ్ళే. కానీ ఉన్న ఇద్దరు ముగ్గురితోనే జగన్ కు తలనొప్పులొస్తున్నాయి.
తాజాగా మంత్రి బొత్సా సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలపై జనాలు మండిపోతున్నారు. బొత్సా వ్యాఖ్యలను ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని కాదు కానీ బొత్స మాట్లాడింది కూడా తప్పే. గురువారం నాడు అమరావతి ప్రాంతంలో చంద్రబాబునాయుడు పర్యటించబోతున్నారు. ఇదే విషయమై మీడియాతో బొత్స మాట్లాడుతూ ’ఎందుకని స్మశానంలో తిరగుదామని చంద్రబాబు వస్తున్నారు’ అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి.
బొత్స మాటల ప్రాకరం అమరావతి అంటే స్మశానమనే అర్ధం వస్తుంది. నిజానికి సీనియర్ పొలిటిషియన్, మంత్రిగా ఉన్న బొత్స మాట్లాడాల్సిన మాటలు కాదివి. కేవలం నోటిదురద కారణంగా చేసిన వ్యాఖ్యలే. అలాగే మరో మంత్రి కొడాలి నాని కూడా చంద్రబాబు, నారా లోకేష్, దేవినేని ఉమ లాంటి వాళ్ళను ఉద్దేశించి చాలా చీప్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబును పట్టుకుని పెద్ద ఎధవ, సన్నాసి లాంటి పదాలు వాడుతున్నారు. కొడాలి వ్యాఖ్యలు వైసిపి శ్రేణులు వినటానికి బాగుంటాయేమో కాని మిగిలిన జనాలు హర్షించరు.
మంత్రులు మాట్లాడినట్లే టిడిపి నేతలు కూడా మాట్లాడటం మొదలుపెడితే ఇక జాతరలో తిట్టుకున్నట్లే ఉంటుంది. ప్రతిపక్షాల టార్గెట్ జగన్ మాత్రమే అన్న విషయం మరచిపోకూడదు. మంత్రుల్లో ఎవరేం మాట్లాడినా మొత్తాన్ని చంద్రబాబు అండ్ కో జగన్ కే ఆపాదిస్తున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడిన మంత్రులను టార్గెట్ చేసుకోవాల్సిన చంద్రబాబు అండ్ కో జగన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?
ఎందుకంటే వాళ్ళ ఉద్దేశ్యమే జగన్ టార్గెట్ చేయటం కాబట్టి. జగన్ మైనస్ మంత్రివర్గం జీరే క్రిందే లెక్క. అందుకనే మాట్లాడిన మంత్రులను వదిలిపెట్టి జగన్నే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి నోటి దురదతో మాట్లాడే మంత్రులను కంట్రోల్ చేయకపోతే జగన్ కు తలనొప్పులు తప్పేట్లు లేదు.