
ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైన తరువాత 30 మంది ఆర్టీసీ కార్మికులు వివిధ కారణాల వలన మృతి చెందారు. ఈ 30 మందిలో కొందరు ఆత్మహత్య చేసుకోగా మరికొందరు గుండెపోటుతో మరణించారు. హైకోర్టులో ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని , కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
నిన్న హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. పిటిషనర్ విశ్వేశ్వరరావు 30 మంది దాకా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు, గుండెపోటుతో ప్రాణాలు వదిలారని విధుల్లోకి రానివ్వకపోవడంతో ఆర్టీసీ కార్మికులు దయనీయ పరిస్థితులలోకి కూరుకుపోయారని పేర్కొన్నారు. హైకోర్టుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని కమిటీని ఏర్పాటు చేస్తే ఆత్మహత్యలకు, సమ్మెకు సంబంధం ఉందో లేదో తెలుస్తుందని వాదనలు వినిపించారు.
హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ పై స్పందిస్తూ ఆర్టీసీ కార్మికులు నిస్సహాయలు అని అనుకోవటం తప్పని వారు సరైన వేదికను ఆశ్రయించటం లేదని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. పని లేని కారణంగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గుండెపోటుకు గురయ్యారని చెప్పడానికి తగిన ఆధారాలను చూపడం లేదని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. సెల్ఫ్ డిస్మిస్ అంటూ ప్రభుత్వం ఎవరినైనా తొలగించిందా...? తొలగించలేదు కదా..? అని హైకోర్టు ప్రశ్నించింది.
హైకోర్టు ధర్మాసనం రాజ్యాంగం హైకోర్టుకు అపరిమితమైన అధికారాలను కట్టబెట్టిందని అదే సమయంలో పరిమితులను కూడా విధించిందని వ్యాఖ్యలు చేసింది. చట్టపరిధికి లోబడే పని చేయగలమని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. కొన్ని పిటిషన్ లను ప్రజా ప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణిస్తుంటే మా వద్ద మంత్రదండం ఉందనుకుంటున్నారని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ప్రతి కార్మికుడు సొంతంగా కేసులు దాఖలు చేయవచ్చని పీఎఫ్ వాడుకున్నారని, సర్వీస్ పరిస్థితులు బాగా లేవని, సెప్టెంబర్ నెల జీతాన్ని ఇవ్వడం లేదని కార్మిక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని హైకోర్టు పేర్కొంది.