పసిపిల్లలకు తల్లిపాలు ఆరోగ్యకరం, అమృతం అన్న విషయం తెలిసిందే. నిపుణులు శిశువు ఆరోగ్యకరమైన పెరుగుదలకు అమ్మపాలే మంచివని, తల్లిపాలకు మరే ఇతర ఆహారం సాటిరాదని చెబుతున్నారు. కానీ కొన్ని సందర్భాలలో వైద్యపరంగా ఉన్న ఇబ్బందుల వలన పిల్లలకు పాలు ఇవ్వలేని పరిస్థితి తల్లులకు ఏర్పడుతుంది. మార్కెట్ లో ఇప్పుడు తల్లిపాలు దొరుకుతున్నాయి.
కొన్ని సంస్థలు కొందరు తల్లుల నుండి పాలను స్వీకరించి ఆ పాలను ప్రాసెస్ చేసి స్టోర్ చేసి పిల్లలకు అందిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని కొన్ని ఆస్పత్రులలో ఇబ్బందులతో ఉన్న తల్లుల పిల్లలకు ఇతర తల్లుల పాలను అందిస్తున్నారు. తొలిసారి నీలోఫర్ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం అయింది. రెయిన్ బో, ఫెర్నాండేజ్ మొదలైన ఆస్పత్రులు కూడా మిల్క్ బ్యాంక్ లను ప్రారంభించాయని సమాచారం.
వైద్యులు తల్లి నుండి పాలను దానంగా పొందటానికి ముందే అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పాలను వైద్యులు పరిశీలించిన తరువాత మాత్రమే వాటిని పిల్లలకు తాగిస్తున్నట్లు ఒక వైద్యుడు చెప్పాడు. అయితే దీనికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఒక మిల్క్ బాటిల్ కు 250 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థ నిర్వాహకులు సేకరించిన పాలను భద్రపరచడానికి, ఇతర ఖర్చులకు మిల్క్ బాటిల్స్ ద్వారా వచ్చిన డబ్బును ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
సంస్థ నిర్వాహకులు పాలను కొంటున్న వారి వివరాలు కానీ, వాటిని ఇస్తున్న మహిళల గురించి బయటకు చెప్పటం లేదు. విదేశాల్లో తల్లిపాలను సేకరించి అమ్మటం సాధారణమే అయినప్పటికీ మన దేశంలో మాత్రం కొందరు ఈ విధానాన్ని తప్పుగా భావిస్తున్నారు. సిజేరియన్ ఆపరేషన్ అయిన మహిళలు, ఏదైనా వైద్య సమస్యల వలన పిల్లలకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నవారు డబ్బు చెల్లించి మిల్క్ బాటిల్స్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. తల్లిపాలను తాగే పిల్లల్లో డయేరియా, న్యూమోనియా వంటి వ్యాధులు రావని నిపుణులు చెబుతున్నారు.