వైఎస్ జగన్ ఏపీ సీఎం అయ్యాక బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పదం.. రివర్స్ టెండరింగ్.. గతంలో చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా టెండర్లు నిర్వహించి.. అయిన వారికి కోట్లు దోచిపెట్టాడని జగన్ ఆరోపించారు. దీన్ని అరికట్టేందుకు ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు ఆయన రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశ పెట్టాడు.
ఈ రివర్స్ టెండర్లో జగన్ పోలవరంలో వందల కోట్లు ఆదా చేశారు కూడా. ఇప్పుడూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు జగన్ సర్కారు మరో రివర్స్ విజయం సాధించింది. గృహ నిర్మాణ శాఖలోనూ రివర్స్ టెండర్ల విధానం అవలంభించి మరో 109 కోట్లు ఆదా చేశారు. ఈ వివరాలను వైసీపీ మంత్రి బొత్స సత్య నారాయణ మీడియాకు వివరించారు.
హౌసింగ్ స్కీమ్‌లో రివర్స్‌టెండరింగ్ ద్వారా రూ.105.91 కోట్లు ఆదా చేశామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పేదవాడికి ఇచ్చే ఇంటిలో కూడా చంద్రబాబు దోపిడీ చేశారనేందుకు ఇది నిదర్శనమన్నారు. రివర్స్‌టెండరింగ్ ద్వారా పోలవరం ఆలస్యమైపోతుందని మాట్లాడిన చంద్రబాబు, ఆయన తాబేదారులు దీనికి ఏం సమాధానం చెబుతారన్నారు. చంద్రబాబు పంచభూతాలను పంచుకొని తిన్నాడని మంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు.
చంద్రబాబు హయాంలో హౌంజింగ్ లో చదరపు అడుగుకు రూ.300 దోపిడీ జరిగిందని మంత్రి బొత్స సత్య నారాయణ వివరించారు. ట్యాక్సెస్ కలుపుకోకోకుంటే చదరపు అడుగు నిర్మాణానికి రూ. 16 నుంచి రూ. 18 వందల ఖర్చు అని, ట్యాక్సెస్ కలుపుకుంటే రూ.1793 నుంచి రూ.2055 అవుతుందని అగ్రిమెంట్‌లో ఉందన్నారు. ఇవాళ ట్యాక్సెస్ లేకుండా సరాసరి రూ.1312కు చదరపు అడుగు నిర్మాణం జరుగనుందన్నారు. ఇదొక మచ్చు తునక మాత్రమేనని, మళ్లీ వచ్చే నెల డిసెంబర్ 12వ తేదీన రూ. 15856 ఇళ్లకు ఇంకో టెండర్ ఉందని మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు.