
మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్నో రాజకీయ సమీకరణాలు... ఎన్నో మలుపులు... మరెన్నో ఎత్తులు పైయెత్తుల తర్వాత చివరికి శివసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-ఎన్సీపీ ల కలయికతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన పార్టీ. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకరం చేశారు.ఇదిలా ఉండగా మహారాష్ట్రలో ఇటీవలే రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సమయంలో బీజేపీ ఎన్సీపీ పార్టీలు కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయ్ అనే ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ తో ప్రత్యేకంగా భేటీ కావడం కూడా ఊహాగానాలకు బలం చేకూరింది. శరత్ పవార్ కు రాష్ట్రపతి పదవి ఇస్తామని బీజేపీ హామీ ఇవ్వడంతో శరత్ పవార్ బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి.
అయితే మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో మోడీతో భేటీ అయిన శరత్ పవార్ ఆ నాటి భేటీలో గురించి తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయినప్పుడు ఇద్దరం కలిసి పని చేద్దాం అంటూ మోడీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని శరత్ పవార్ చెప్పారు. అయితే తాను మోదీ ప్రతిపాదనను తిరస్కరించానని శరత్ పవార్ అన్నారు . మనిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు బాగున్నాయని...కానీ కలిసి పని చేయడం మాత్రం జరిగే పని కాదు అంటూ చేప్పినట్లు శరత్ పవార్ చెప్పుకొచ్చారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తనకు రాష్ట్రపతి పదవి ఆఫర్ చేసినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని... అలాంటి ప్రతిపాదన ఏది తమ మధ్య చర్చకు రాలేదని శరద్ పవార్ స్పష్టం చేశారు.
కానీ తన కుమార్తె సుప్రియా సూలే ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే విషయం మాత్రం తమ భేటీలో చర్చకు వచ్చిందని అన్నారు. కాగా రాజకీయ సంక్షోభం ఏర్పడిన సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించడం... ఆ వెంటనే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హస్తినకు వెళ్ళి మోదీతో చర్చలు జరపడం కూడా మహారాష్ట్ర లో కొత్త పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు . అంతే కాకుండా రాత్రికి రాత్రి ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో మంతనాలు జరిపి అజిత్ పవార్ మద్దతుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా... బలనిరూపణకు గవర్నర్ ఎక్కువగానే సమయం కేటాయించారు. దీంతో శరత్ పవార్ ను కూడా తమ వైపు తిప్పుకుని ఎన్సీపీ మద్దతుతో బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని నిలువుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ చివరికి శివసేన పార్టీ తన పంథాను నెగ్గించుకుంటూ కాంగ్రెస్-ఎన్సీపీ కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.