తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి వల్ల ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలతో ఇబ్బందిపడుతున్నారు జనం.

 

 నెల క్రితం వరకు జోరు చూపించిన వర్షాలు.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తున్నాయి‌. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో విడత వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడగా, మరి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడుతున్నాయి. నెల్లూరులో కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. గూడూరులో పంబలేరు వాగు పొంగి పోర్లుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అటు కడపలోనూ వరుణడు తన జోరు చూపిస్తున్నాడు. భారీ వర్షాలతో కోడూరు-చిట్వేల్‌కి వెళ్లే దారిలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు నానా వ్యవస్థలు పడుతున్నారు. 

 

ద్రోణి ప్రభావంతో తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసిపోయింది. సరైన టర్ఫలిన్‌లు లేక ధాన్యం తడిచిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందారు. అటు వర్షం కారణంగా భూపాలపల్లి జిల్లాలో ఓసీపీ సింగరేణి 2లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గని వద్ద బురదమయంగా మారడంతో ఉత్పత్తి చేయలేకపోతున్నామని అధికారులు తెలిపారు. దీంతో సంస్ధకు కోటి రూపాయల నష్టం వాటిల్లింది.

 

మొత్తానికి అకాల వర్షాలు జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తీరా చేతికొచ్చే పంట వర్షం భారిన పడి పాడైపోవడంతో రైతు లబోదిబోమంటున్నాడు. ఏం చేయాలో పాలుపోక దిగాలుగా కూర్చొని కన్నీళ్లు పెడుతున్నాడు. వరణుడు కరుణించి కొద్ది రోజులు కురవకుంటే బాగుంటుందని ఆ దేవుడిని వేడుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: