దిశ కేసులో ఆమె మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. దిశ నిందితుల్ని వీడియో తీసి ఉంటుందనే అనుమానాలున్నాయి. తన చెల్లితో ఫోన్ మాట్లాడినప్పుడే లారీ డ్రైవర్ల గురించి భయం వ్యక్తం చేసిన దిశ.. ఖచ్చితంగా ఫోన్లో ఏదో చేసి ఉంటుందనే సందేహాలున్నాయి. ఇప్పటిదాకా దొరకని దిశ మొబైల్.. ఇప్పుడు దొరకడంతో.. కేసు కీలక మలుపు తిరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
దిశ ఘటనలో ఆమె మొబైల్ ఫోన్ కీలకం. సంఘటన జరిగినప్పటి నుండి ఆమె సెల్ ఫోన్ ఎక్కడుందో జాడ తెలియలేదు. నిందితులను కస్టడీకి తీసుకున్న వెంటనే పోలీసులు.. మొబైల్ ఫోన్ పై ఆరా తీశారు. చటాన్ పల్లిలో దిశను తగలబెట్టిన ప్రాంతానికి కొద్ది దూరంలో భూమిలో పాతిపెట్టినట్లు నిందితులు వెల్లడించారు. నిందితులతో కలిసి పోలీసులు అక్కడికి వెళ్లినప్పుడే.. మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పుడు ఆ ఫోన్ లో ఏమేమి ఉన్నాయన్నది కీలకంగా మారింది. తన చెల్లెలికి ఫోన్ చేసినప్పుడే లారీ దగ్గర ఉన్న ఆ నలుగురి వ్యవహారశైలిని అనుమానించింది దిశ. ఆ టైంలో ఆమె వాళ్లు అనుమానాస్పదంగా వ్యవహరించిన తీరును తన మొబైల్ లో రికార్డ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే.. నిందితులు నలుగురిలో మహ్మద్ ఆరీఫ్ దిశను బలవంతంగా కాంపౌండ్ వాల్ లోపలికి లాక్కెళ్లే ప్రయత్నంలో అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆ టైంలో ఆమె శక్తి సరిపోకపోవడం, అరుపులు పెట్టే వీల్లేకుండా చెన్నకేశవులు దిశ నోట్లో బట్టలు కుక్కడంతో ఆమె నిస్సాహాయురాలైనట్లు సమాచారం.
కస్టడీలో నిందితులను విచారించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, శంషాబాద్ డిసిపి.. ప్రత్యేక పోలీసు బృందాలకు సూచనలిస్తున్నారు. నిందితులనుండి సమాధానాలు రాబట్టేందుకు ఇప్పటికే క్వశ్చనేర్ ను తయారు చేసుకున్నారు. అవసరాన్ని బట్టి రాత్రి సమయాల్లో నిందితులను జైలు నుండి బైటకు తీసుకెళతారు. లేదంటే.. జైల్లోనే వాళ్లను విచారిస్తారు. ఏడు రోజుల పాటు జరిగే విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తాయని భావిస్తున్నారు.