దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ దారుణ హత్య ఘటనలో ఈరోజు తెల్లవారుజామున నిందితులు ఎన్ కౌంటర్ కు గురయ్యారు. షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. పారిపోవడానికి ప్రయత్నం చేసిన నిందితులను పోలీసులు కాల్చి చంపారు. ప్రధాన నిందితుడు అరిఫ్ షాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు.
పోలీసులు ఎన్ కౌంటర్ కు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. మరికాసేపట్లో ఎన్ కౌంటర్ గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. దిశను చంపిన ప్రాంతంలోనే నిందితులు ఎన్ కౌంటర్ కు గురి కావడం గమనార్హం. పోలీసులు తమ వద్ద ఉన్న ఆయుధాలను తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించారని ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపామని చెబుతున్నట్లు తెలుస్తోంది.
దిశ కుటుంబ సభ్యులు దిశ దారుణ హత్యకు కారణమైన నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేశారు. నిందితులను ఇంత త్వరగా శిక్షించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. దిశ తల్లిదండ్రులు ప్రభుత్వానికి, మీడియాకు, సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. దిశ హత్య కేసు ఘటనలో ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
సీఎం కేసీఆర్ రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ప్రభుత్వం కూడా నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుతో పాటు సిట్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దిశ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు సరైన శిక్ష పడిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.