కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు యడ్యూరప్ప ప్రభుత్వానికి అనుకూలంగా వస్తున్నాయి. 15 శాసనసభ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగగా బీజేపీ పార్టీ అధికారంలో ఉండాలంటే కనీసం ఆరు శానసభ నియోజకవర్గాల్లో గెలుపొందాల్సి ఉంది. కర్ణాటక ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వం దూసుకుపోతుంది. 15 స్థానాల్లో 11 సీట్లలో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. 2 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా ఒక స్థానంలో జేడీఎస్ ఆధిక్యంలో ఉంది. 
 
స్వతంత్ర్య అభ్యర్థి ఒక చోట లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 6 సీట్లను సాధిస్తే బీజేపీ ప్రభుత్వానికి ఢోకా లేదు. సీఎం యడ్యూరప్పకు ఈ ఎన్నికలు చాలా కీలకం కాగా ప్రభుత్వం నిలబెట్టుకోవటానికి కావాల్సిన 6 సీట్లను బీజేపీ సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 15 మంది రెబల్ అభ్యర్థులకు పార్టీ టికెట్లు ఇచ్చి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేయించింది. 
 
సీఎం యడ్యూరప్ప ఉపఎన్నికలు జరిగిన ప్రతి నియోజకవర్గంలో తిరిగి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉండటంతో ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించటానికి యడ్యూరప్ప చాలా కష్టపడ్డారు. బీజేపీ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే సంబరాలు ప్రారంభించారు. బీజేపీ ఎత్తుగడల ముందు కాంగ్రెస్, జేడీఎస్ పాచికలు పారలేదు. 
 
ఉపఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉండటంతో బీజేపీ సంబరాలు జరుపుకుంటుంటే కాంగ్రెస్, జేడీఎస్ మాత్రం సాయంత్రంలోపు ఫలితాలు మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. 224 స్థానాలున్న శాసనసభలో బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ కు 66 మంది, జేడీఎస్ కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటకలో 17 మంది శాసన సభ్యులపై అనర్హత వేటు పడగా రెండు స్థానాలకు ఇతర కారణాలతో ఉప ఎన్నికలు నిర్వహించలేదు. తాజా సమాచారాన్ని బట్టి యడ్యూరప్ప ప్రభుత్వం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: