దిశపై మాత్రమే కాదు.. మరికొందరిపై కూడా దారుణ హత్యాచారాలు జరిగాయని వాటినెందుకు పట్టించుకోరని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మండిపడుతున్నాయి బాధిత కుటుంబాలు. బాధితులపై ఈ వివక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
దిశ ఘటన యావత్ దేశాన్నే కుదిపేసింది. అదే సమయంలో ఇతర బాధిత కుటుంబాలు తమకూ న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. దిశకు జరిగిన అన్యాయాన్ని తామూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ, దిశ నిందితులకు వారం రోజుల్లోనే శిక్ష విధించారు. మరి మా బిడ్డలు కూడా ఆడబిడ్డలే కదా..? ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. తమ బిడ్డలను అతి క్రూరంగా చంపిన వారికి శిక్ష విధించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
టేకు లక్ష్మి, ఆసిఫాబాద్ కు చెందిన మహిళ. గత నెల 24న భర్త ఇంట్లో లేని సమయంలో కొందరు వ్యక్తులు లక్ష్మిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేసి, చేతులు విరిచేసి, గొంతుపై తీవ్రగాయం చేసి చిత్ర హింసలు పెట్టి చంపారు. ఆసిఫాబాద్ జిల్లా జహినూర్ మండలంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగి 15 రోజులవుతున్నా, ఇప్పటికీ పట్టించుకునే వారులేరు.
దేశంలో ప్రతినిత్యం ఎక్కడోచోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని, అయితే బాధితులు ఆధిపత్య కులాలు అయితేనే స్పందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దళిత మహిళ టేకు లక్ష్మి సంబంధీకులతో పాటు, వరంగల్ అమ్మాయి మానస కుటుంబం కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. దిశ ఘటన జరగటానికి కొన్ని గంటల ముందే మానస ఘటన కూడా జరిగింది. పుట్టినరోజు కావడంతో దేవాలయానికి వెళ్లి వస్తానంటూ బయటికి వెళ్లి శవమై కనిపించింది. మానసను ముగ్గురు కలసి చంపారనీ, అయినా, పోలీసులు మాత్రం ఒక్కరినే అరెస్టు చేశారని మండిపడుతున్నారు. తాము పేదవాళ్లమని, బలహీన వర్గానికి చెందిన వాళ్లమని వివక్ష చూపుతున్నారా? అని మానస తల్లి నిలదీస్తోంది.
మరోపక్క వరంగల్ లో తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం చేసి చంపిన ఘటనలో నేరస్తుడు ప్రవీణ్ కు వరంగల్ కోర్ట్ ఉరి శిక్ష విధించింది. కానీ, దానిని హైకోర్ట్ యావజ్జీవ శిక్షగా మార్చటంపై చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. తక్షణ న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లి కడుపుకోతను అర్ధం చేసుకోవాలని నిలదీస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఆందోళనకు దిగారు.
అటు హాజీపూర్ లో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ముగ్గురిని అత్యాచారం చేసి, హత్య చేస్తే ఇప్పటికీ శిక్ష విధించలేదనే విమర్శలు పెరుగుతున్నాయి. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డలు చనిపోయి 8 నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ఎందుకు శిక్షపడలేదని ప్రశ్నిస్తున్నారు. తమకు బిడ్డలను అంతం చేసిన నిందితులకు శిక్ష పడి ఉంటే దిశ ఘటన జరిగి ఉండేదా అని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. తమనెందుకు పరామర్శించరని, తమనెందుకు పట్టించుకోరని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక తల్లికి ఒక న్యాయం, మరో తల్లికి మరో న్యాయమా?. బిడ్డల దగ్గర కులం, మతం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి బాధిత కుటుంబాలు.