దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఊహించని ట్విస్ట్‌లు తీసుకుంటుంది. ఘటనపై ఓ వైపు ఎన్.హెచ్.ఆర్.సి  దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయ తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక సిట్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టీ సర్కార్. 

 


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ఘటనపై దర్యాప్తు చేయాడానికి ప్రత్యేక సిట్‌ను నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. దిశ హత్య కేసుతో పాటు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనుంది. ఈ ఎన్‌కౌంటర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఈ సిట్ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు టీమ్‌లో ఎస్పీ అపూర్వారావు, మంచిర్యాల డి.సి.పి ఉదయ్‌ కుమార్‌, రాచకొండ అదనపు డి.సి.పి సురేంద్ర రెడ్డి, రంగారెడ్డి డి.ఎస్.పి శ్రీధర్‌ రెడ్డి, రాచకొండ ఐటీసెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, కోరుట్ల ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌, సంగారెడ్డి ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. మొత్తం ఎనిమిది మంది అధికారులు సిట్‌ టీమ్‌లో ఉన్నారు.

 


దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ అందజేసిన నివేదికను న్యాయస్థానానికి అందజేయనుంది ప్రభుత్వం. కేసులోని సున్నితత్వం దృష్ట్యా సిట్‌ బృందానికి సహకరించాలని ప్రభుత్వం అన్ని విభాగాలను ఆదేశించింది. వీలైనంత త్వరగా ఎంక్వయిరీ పూర్తి చేసి సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక రంగంలోకి దిగిన సిట్ బృందం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో అన్ని సాక్ష్యాధారాలను, ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసుల నుంచి సమాచారాన్ని  సేకరిస్తోంది. చివరకు ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.


  

డిసెంబర్‌ 28న దిశ హత్యాచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం నలుగురు నిందితులను పోలీసులు విచారించేందుకు దిశను తగులబెట్టిన ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. ఈనెల 6న తెల్లవారుజామున నిందితులు తమ వద్ద ఉన్న తుపాకులను లాక్కుని వారి మీద రాళ్లతో దాడి చేశారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. నిందితులు కాల్పులు జరపడంతో పోలీసులు ప్రాణరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారని తెలిపారు. దీనిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. 

 

ఓ వైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జాతీయ మానవహక్కుల కమిషన్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండ్రోజుల నుంచి ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌హెచ్‌ఆర్సీ ఇప్పుడు మరో రెండ్రోజులు కేసుపై విచారణ చేపట్టనుంది. చూడాలి మరి ఈ రెండు బృందాలు చివరకు ఎలాంటి నివేదకలను అందిస్తాయో తదనంతరం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ అందరిలొ నెలకొని ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: