అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అడవిపై ఆదివాసీలకు హక్కులు కల్పించాలని ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆదివాసీల ఐక్య సమాఖ్య ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిన్న భారీ బహిరంగ సభను నిర్వహించారు. సోయం బాపూరావు మాట్లాడుతూ లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి వెంటనే తొలగించాలని ఎస్టీ రిజర్వేషన్లలో 97 శాతం లంబాడాలే అనుభవిస్తున్నారని అన్నారు. 
 
ఈ సభకు వేలాదిమంది ఆదివాసీలు మూడు రైళ్లలో పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణ నుండి తరలి వచ్చారు. ఆర్టికల్ 342 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ హోదాపై చట్టబద్ధత లేదని సోయం బాపూరావు అన్నారు. ఆదివాసీలు లంబాడీలను ఎస్టీల్లో చేర్చడం వలన నష్టపోతున్నారని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుండి లంబాడాలు ఎస్టీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో లంబాడాలను ఎస్టీల్లో చేర్చిన తరువాత వారి జనాభా అధికమైందని సోయం బాపూరావు చెప్పారు. పార్లమెంటులో ఆదివాసీల హక్కుల కొరకు పోరాడతామని చెప్పారు. లంబాడాలను ఎస్టీల్లో చేర్చడం వలన ఆదివాసీలు భూమూలు, ఉద్యోగాలు, విద్యావకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. ఆదీవాసీల సమస్యలు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు వివరించానని సోయం బాపూరావు చెప్పారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని 9 ఆదివాసీల తెగల పట్ల బీజేపీ పార్టీ పోరాడుతుందని సోయం బాపూరావు అన్నారు. సుప్రీం కోర్టులో ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమ, సాంసృతిక రంగం తరపున దాఖలైన పిటిషన్ గురించి టీఆర్ ఎస్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోరారు. ములుగు, అసిఫాబాద్ ఎమ్మెల్యేలు సీతక్క, ఆత్రం సక్కులు ఆదివాసీల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఉద్యోగులు హాజరయ్యారు. చుంచు రామకృష్ణ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ఆదివాసీలకు భోజన, రవాణా వ్యవహారాల విషయంలో సమన్వయకర్తగా వ్యవహరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: