తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతిపక్షాల మాయలో పడొద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలియచేయడం జరిగింది. గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో టీఆర్‌ఎస్ కార్యక విభాగం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనం పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞత సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు ఉపన్యాసాల పార్టీలని, ఎక్కడ మంది కూడితే అక్కడికి వెళ్లి తోచినట్లుగా మాట్లాడతారని, ఆ పార్టీల మాయలో పడొద్దని సూచించారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల కోసం ఆలోచించిన ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు.
సీఎం కేసీఆర్ మనసున్న మారాజుయని కొనియాడారు. ఏన్నో ఏళ్ల నుంచి గ్రామపంచాయతీ కార్మికులు తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడ్డారని, నెలకు రూ.500 నుంచి రూ.1500 మాత్రమే వచ్చేవని, పేరుకు జీపీ కార్మికులు అయినా జీవనం గడవుపుకునేందుకు ఇతర కూలీ పనులకు వెళ్లేవారని తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని ఆలోచించి జీపీ కార్మికుల వేతనాలను రూ.8500గా నిర్ణయించారని గుర్తు చేయడం జరిగింది.
దశల వారీగా అందరి, అన్ని సమస్యలను పరిష్కరించేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. కారోబార్ హోదాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గ్రామపంచాయతీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ కృతజ్ఞత చూపాలన్నారు. పల్లె ప్రగతిని విజయవంతం చేసినట్లుగానే నిత్యం గ్రామాభివృద్ధి పని చేసి ఆ కృతజ్ఞతను చూపాలన్నారు.
గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతి నెల రూ.339 కోట్లు ఇస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రానికి నిధుల విడుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఆసరా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ .9,800 కోట్లు వెచ్చిస్తుందని, కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే ఇస్తోందని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్ రెడ్డి, రూప్ సింగ్, రాంబాబుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.