చంద్రబాబునాయుడును అసెంబ్లీలోకి రానీకుండా చేయటానికి వైసిపి కుట్రలు చేస్తోందా ? ట్విట్టర్లో చంద్రబాబు ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ చంద్రబాబుకు ఎందుకు ఇటువంటి అనుమానం వచ్చింది ? తన వైఫల్యాలను చంద్రబాబు అసెంబ్లీలో ఎండగడుతుంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారట. అందుకనే అసెంబ్లీ నుండి తనను బయటకు పంపేందుకు జగన్ కుట్ర చేస్తున్నట్లు చంద్రబాబు అనుమానిస్తున్నారు.
అసలు చంద్రబాబు అనుమానం ఎంతవరకూ సబబో చూద్దాం. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరూ కుట్రలు చేయటం లేదన్నది వాస్తవం. అసెంబ్లీలో జరిగిందేమిటంటే గురువారం ఉదయం పార్టీ జనాలను వెంటేసుకుని చంద్రబాబు, చినబాబు అసెంబ్లీలోకి ఎంటరవ్వటానికి ప్రయత్నంచేశారు. దాన్ని మార్షల్స్ అడ్డుకున్నారు. అక్కడ రెండు వైపుల పెద్ద గొడవే అయ్యింది.
ఆ గొడవపై అసెంబ్లీలో టిడిపి సభ్యులు ప్రస్తావించారు. దాంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు స్పీకర్ ఆడియో, వీడియో ఫుటేజీలను ప్రదర్శించారు. దాంట్లో చీఫ్ మార్షల్ ను చంద్రబాబు బూతులుతిట్టిన విషయం బయటపడింది. అలాగే చంద్రబాబు మీద ఏ మార్షల్ కూడా ధౌర్జన్యం చేయలేదన్న విషయం కూడా రూఢీ అయ్యింది. దాంతో చీఫ్ మార్షల్ ను బూతులు తిట్టినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ మంత్రులు, సభ్యులు డిమాండ్ చేశారు.
ఎవరెంత డిమాండ్ చేసినా, ఎన్నిసార్లు వీడియోని ప్లే చేసినా తాను తిట్టలేదనే చంద్రబాబు బుకాయించారు. అదే సమయంలో జగన్, మంత్రులు ఎవరెవరు ఏమేమి తిట్టారన్న చిట్టాను చంద్రబాబు వినిపించటం మొదలుపెట్టారు. దాంతో స్పీకర్ జోక్యం చేసుకుని చీఫ్ మార్షల్ ను చంద్రబాబు తిట్టింది వాస్తవమే అని తేల్చారు.
సభలో క్షమాపణ చెప్పేస్తే హుందాగా ఉంటుందని చెప్పినా వినకపోవటంతో చంద్రబాబు మీద చర్యలు తీసుకునే అధికారాన్ని స్పీకర్ కు ఇస్తు సభ తీర్మానం చేసింది. అంటే చంద్రబాబు మీద స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది సస్పెన్స్ గా మారింది. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీకి తనను దూరం చేయటానికి వైసిపి కుట్ర చేస్తోందంటూ చంద్రబాబు ఆరోపణలు మొదలుపెట్టారు. చంద్రబాబు గనుక క్షమాపణ చెప్పకపోతే సభ నుండి సస్పెండ్ చేసినా చేస్తారు. ఆ విషయం అర్ధమైన తర్వాతే చంద్రబాబు గోల మొదలుపెట్టారు. చూద్దాం ఏం జరుగుతుందో ?