అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్లును మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చట్టం తెస్తున్నామని తెలిపారు. పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలను సీఎం జగన్ ప్రత్యక్షంగా చూశారని, ఇకపై ప్రజారవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం చేస్తామన్నారు. కార్మికుల ఉద్యోగభద్రత కోసమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని పేర్ని నాని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనున్నట్లు వెల్లడించింది. తొలి క్యాబినెట్ సమావేశంలో దానికి సుముఖత వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. ఆర్టీసీ విలీనం కోసం నిపుణుల కమిటీని నియమించారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ 90 రోజుల పాటు అధ్యయనం చేసి, తమ నివేదికను ప్రభుత్వానికి అందించింది.ఐదు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది. అందులో ఆర్టీసీ విలీనం కోసం ప్రభుత్వంలో ప్రజా రవాణా విభాగం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రధానమైనది. దాంతో పాటుగా ఆర్టీసీని విలీనం చేయకుండా, సంస్థ అవసరాలకు తగ్గట్టుగా గ్రాంట్స్ రూపంలో సహాయం అందించడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించింది.
ఏపీఎస్ ఆర్టీసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.3,300 కోట్ల నుంచి రూ.3,200 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఛార్జీల విషయంలో రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు కోసం ప్రతిపాదన చేశారు. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 60 సం.లకు ఉద్యోగ విరమణ ఉంటుంది. ప్రస్తుతం ఈ సంస్థ సిబ్బందికి అది 58 ఏళ్లుగా ఉంది. సిబ్బందికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన మూడు నెలల్లో పూర్తి చేస్తామని క్యాబినెట్ ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు.
ఇన్నాళ్ళుగా ఈ ఆర్టీసీ ఉద్యోగులకు ట్రేడ్ యూనియన్ చట్టాలు అమలవుతున్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు నియమావళి వేరుగా ఉంటుంది. ఈఎస్ఐ స్థానంలో ప్రభుత్వం ఉద్యోగులకు అందిస్తున్న హెల్త్ కార్డులు కేటాయిస్తారు. ఈపీఎఫ్ విషయంలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ అమలు చేస్తున్నారు. దానిని రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానం ఇప్పుడు విలీనం కాబోతున్న సిబ్బందికి వర్తింపజేస్తారా, లేక మరో మార్గం అన్వేషిస్తారా అన్నది స్పష్టం కావాల్సి ఉంటుంది. సిబ్బంది సంక్షేమం విషయంలోనూ పలు అంశాలపై స్పష్టత రావాలి. ఒకటి రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ కార్మికులకు సమకూరే మరిన్ని ప్రయోజనాలు తెలిసే అవకాశం ఉంది.