ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంకు సెక్యూరిటీని మరింత పెంచారు.. కొత్తగా ఆక్టోపస్ బలగాలను భద్రత కోసం కేటాయించారు. మూడు షిఫ్టుల్లో ఆరుగురు ఆక్టోపస్ టీమ్ జగన్‌కు సెక్యూరిటీని ఇస్తారు. ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకోగా.. ఏపీ సీఎం ఇక ఆక్టోపస్ బలగాల పహారాలోకి వెళ్లారు.
మొన్నటి వరకు ఎస్పీఎఫ్ పోలీసులతో పాటూ గన్‌మెన్లు సీఎం జగన్‌కు భద్రత కల్పించేవారు. ఇప్పుడు ఆక్టోపస్ బలగాలను సెక్యూరిటీ కోసం కేటాయించారు. వీరు కూడా ఏపీ పోలీసుల్లో ఓ భాగం.. ఈ ఆక్టోపస్ బలగాలు కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. స్పెషల్ ఆపరేషన్స్‌లో కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఆక్టోపస్ బలగాలు వచ్చినా.. మరికొంతమంది పోలీసులు కూడా సీఎం సెక్యూరిటీలో కొనసాగనున్నారు.
ముఖ్యమంత్రితో పాటూ వీఐపీల భద్రతకు సంబంధించిన నిర్ణయాలను హోం సెక్రటరీ, డీజీపీ, లా ఆర్డర్ ఐజీ, ఇంటిలిజెన్స్ చీఫ్‌లో కూడిన సెక్యూరిటీ రివ్యూ కమిటీ తీసుకుంటుంది. గతంలో జరిగిన కొన్ని ఘటనలు.. ముఖ్యమంత్రి జగన్ భద్రతపై ఫోకస్ పెట్టిన అధికారులు.. ఆక్టోపస్ బలగాలతో సెక్యూరిటీని ఇవ్వాలని నిర్ణయించారు.
మరో వైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి, తల్లి విజయమ్మ విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించారు. ఇద్దరూ కలిసి అక్కడ వస్త్రాలు, ఆభరణాలను కొనుగోలు చేసి కాసేపు సరదాగా గడిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. విజయమ్మ, భారతి కలిసి ఇలా వస్త్రప్రదర్శనను సందర్శించడం బహుశా ఇదే తొలిసారి.
విజయమ్మ, భారతి.. అన్ని రకాల వస్త్రాలు, ఆభరణాలను పరిశీలిస్తూ.. ఆ ప్రాంగణమంతా కలియదిరిగారు. అక్కడి మహిళా సిబ్బందిని ఆత్మీయంగా పలకరించారు. విజయమ్మ, భారతితో కలిసి పలువురు మహిళా సంఘాల నేతలు కూడా చేనేత వస్త్రప్రదర్శననను తిలకించారు. చేనేత వస్త్ర ప్రదర్శనలో భాగంగా అక్కడి వస్త్రాల నాణ్యతను విజయమ్మ, భారతి పరిశీలించారు. జగన్ తల్లి విజయమ్మ కోసం ప్రత్యేకంగా చీరలను కొనుగోలు చేశారు.