దిశ నిందితుల మృతదేహాలకు మళ్లీ రీపోస్టుమార్టం నిర్వహించాల్సిందేనా? ఆ తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తారా? మరో ఏజెన్సీతో రీపోస్టుమార్టం నిర్వహణకు తెలంగాణా ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదు? మృతదేహాల అప్పగింత విషయంలో సుప్రీంకోర్టు చెప్పిందేంటి?
దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగి 15 రోజులయ్యింది. ఎన్ కౌంటర్ లో హతమైన నలుగురి నిందితుల మృతదేహాలను ఇంతవరకు వారి బంధువులకు అప్పగించలేదు. ఎన్ కౌంటర్ పై దర్యాప్తుకు ఇప్పటికీ సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ తెలంగాణాకు చేరుకోలేదు. సుప్రీంకోర్టు మాత్రం.. మృతదేహాల అప్పగింత అంశాన్ని హైకోర్టు నిర్ణయానికి వదిలేసింది. మరోమారు డెడ్ బాడీలకు రీపోస్టుమార్టం నిర్వహించాలన్న అంశం తెరపైకి వచ్చింది.
మృతదేహాల అప్పగింతపై సుప్రీంకోర్టు సూచన మేరకు హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ వాడివేడిగా జరిగింది. డెడ్ బాడీలు కుళ్లిపోయే దశలో ఉన్నందున వాటిని బంధువులకు అప్పగించాలన్న దానిపై ధర్మాసనం తీవ్రంగానే స్పందించింది. ఈ విషయంలో తమ నిర్ణయానికి సుప్రీంకోర్టు వదిలేసినందున.. వెంటనే నాలుగు మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించి.. బంధువులకు వాటిని అప్పగించాలని నిర్ణయించింది. అయితే దీనిపై తెలంగాణా ప్రభుత్వం అడ్డుపడింది. ఇప్పటికే ఆ నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినందున.. మళ్లీ ఆటాప్సీ అవసరం లేదని పేర్కొంది. ఒకవేళ నిర్వహించాల్సి వస్తే.. తెలంగాణా ఫోరెన్సిక్ నిపుణులతోనే చేయించాలని పేర్కొంది. దీనిపై విబేధించిన హైకోర్టు.. మరో ఏజెన్సీతో నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. దీంతో అడ్వకేట్ జనరల్, హైకోర్టు మద్య తీవ్రవాదోపవాదాలు జరిగాక.. విచారణను రేపటికి వాయిదా పడింది. సందిగ్దంలో ఉన్న ఆటాప్సీ విషయంలో హైకోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది? మృతదేహాలకు వాళ్ల బంధువులకు ఎప్పుడు అప్పగించాలన్నది శనివారం విచారణ తర్వాత తేలనుంది. మరోవైపు నిందితుల బంధువులు తమకు నష్టపరిహారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే తమ బిడ్డల మృతదేహాలు తీసుకుంటామనీ.. అంతవరకు తమకు ఆ డెడ్ బాడీలు కూడా అవసరం లేదంటున్నారు.