2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లతో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించటంలో పాదయాత్ర కీలకపాత్ర పోషించింది. ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురంలో ముగిసిన పాదయాత్రకు రూపశిల్పి తలశిల రఘురాం. ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా తెరవెనకే ఉండి తలశిల ప్రణాళిక కార్యాచరణను రూపొందించారు.
పాదయాత్ర సమయంలో పార్టీ ప్రధాన ఘట్టాల్లో ముందు వరసలో నిలిచిన తలశిల ఏనాడూ ప్రచారం మాత్రం కోరుకోలేదు. జగన్ పాదయాత్ర ఏ మార్గంలో వెళితే వీలైనన్ని నియోజకవర్గాలను తాకుతుంది..? బహిరంగసభలు ఎక్కడెక్కడ పెట్టాలి...? జగన్ ఎక్కడ విశ్రమించాలి...? రోజుకు ఎన్ని గంటలు నడవాలి...? పాదయాత్ర చేసే సమయంలో ముఖ్యనేతలను జగన్ కలవడం ఎలా...? ఇలా అన్నీ తలశిల రఘురాం చూసుకున్నారు.
తన భుజస్కందాలపై జగన్ పాదయాత్రను తలశిల రఘురాం నడిపించారు. పాదయాత్ర సమయంలో జగన్ కైనా కొంత రెస్ట్ దొరికిందేమో కానీ తలశిల రఘురాంకు మాత్రం రెస్ట్ దొరకలేదు. తలశిల రఘురాం కృష్ణా జిల్లా గొల్లపూడి గ్రామానికి చెందినవారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. 1993 లో కాంగ్రెస్ పార్టీలో తలశిల రఘురాం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
వైయస్ మరణం తరువాత రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో వైసీపీలో తలశిల రఘురాం చేరారు. పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీలో సభ్యుడిగా చేరిన తలశిల రఘురాం పాదయాత్ర బాధ్యతలను పర్యవేక్షించారు. సీఎం జగన్ ఘనవిజయంలో తలశిల రఘురాం కీలక పాత్ర పోషించారు. పాదయాత్రకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తూ పాదయాత్ర విజయవంతం కావటంలో కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా తలశిల రఘురాం పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. 3 వేల కిలోమీటర్లకు పైగా సాగిన పాదయాత్రలో ఆరునెలలపాటు కష్టపడి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు.