పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగతున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మమత మాట్లాడుతూ.. బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై ఐకరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సవాలు విసిరారు. ఈ రెఫరండంలో బీజేపీ ఓటమి పాలైతే అధికారం నుంచి తప్పుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయిన తర్వాత.. ఇప్పుడు భారత పౌరులుగా నిరూపించుకోవాలా అని ప్రశ్నించారు.
నిరసనల ముసుగులో బీజేపీ కార్యకర్తలే ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీఏఏను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, సీఏఏకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న మమతపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే.. ఆమె ఈ విధంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కర్ణాటక మంగళూరులో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు.
పౌరసత్వ సవరణ చట్టంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మమతపై కేంద్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని హితవుపలికారు. పౌరసత్వ చట్టంపై మమత మాట్లాడుతూ.. ‘బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై ఐకరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సవాలు విసిరారు.
రెఫరండంలో బీజేపీ ఓటమి పాలైతే అధికారం నుంచి తప్పుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయిన తర్వాత.. ఇప్పుడు భారత పౌరులుగా నిరూపించుకోవాలా’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నిర్మలా తీవ్రంగా తప్పుబట్టారు. భారత అంతర్గత విషాయాల్లో ఇతరుల (థర్డ్‌పార్టీ) జోక్యాన్ని తాము ఏమాత్రం స్వాగతించేం లేదని ఘాటు సమాధానమిచ్చారు. కనీస అర్థంలేని విధంగా మమత మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ఇలా ఆందోళనలు చేస్తున్నాయని మండిపడ్డారు.