ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక తొలిసారిగా ఓ కేసును సీబీఐకు అప్పగించింది. టీడీపీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై ఉన్నఅక్రమ మైనింగ్ కేసులపై ఎంక్వైరీ చేసేందుకు సీబీఐకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి కాదు రెండు కాదు హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌తో సహా మొత్తంగా 18 కేసులపై విచారణ చేసేందుకు సీబీఐకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి.. పల్నాడులో మైనింగ్ అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయంటూ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే.. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు టార్గెట్‌గా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. పిడుగురాళ్ల, దాచేపల్లి పరిధిలో మైనింగ్ అక్రమాలకు యరపతినేని తెరలేపారని.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నా.. నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపణలు గుప్పించింది. గతంలోనే యరపతినేనిపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించింది నాటి ప్రభుత్వం. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో విచారణ మరింత వేగవంతమైంది. మరో వైపు ఈ మొత్తం వ్యవహారం కోర్టుకెక్కింది. దీనిపై మరింత లోతైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని సీబీఐ విచారణ చేపడితే బాగుంటుందని గతంలోనే హైకోర్టు సూచించింది.
హైకోర్టు సూచనల మేరకు.. వైసీపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తంగా యరపతినేనిపై పిడుగురాళ్ల, దాచేపల్లిలో నమోదైన మొత్తం 17 కేసులను సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 17 కేసులకు సంబంధించిన వివరాలను సెక్షన్లతో సహా ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. అలాగే అక్రమ మైనింగ్ ఏయే గ్రామాల్లో జరిగింది.. ఆ భూముకు సంబంధించిన సర్వే నెంబర్లను జీవోలో పొందుపరిచింది. కోణంకి, నడుకుడి గ్రామాల్లో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందనే కేసులు వివరాలను జీవోలో స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులతోపాటు.. మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ సీనియర్ నేత టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌ను కూడా ఈ జీవోలో ప్రస్తావిచింది ప్రభుత్వం. అంటే మొత్తంగా 18 కేసులకు సంబంధించిన వివరాలపై ఎంక్వైరీ చేయాల్సిందిగా సీబీఐకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది. యరపతినేని కేసులకు సంబంధించి సీబీఐ ఎంక్వైరీ మొదలు కాగానే.. ఈ మొత్తం కేసులకు సంబంధించిన వివరాలను.. ఇప్పటి వరకు వెలికి తీసిన విషయాలను సీబీఐకు అప్పజెప్పాలని సీఐడీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.