గడచిన కొన్ని రోజులుగా కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ నగరంలో ఆందోళన వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. విద్యార్థులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న సమయంలో ఒక ఫేక్ మెసేజ్ వైరల్ అవడంతో గందరగోళానికి గురవుతున్నారు. ఒక సందేశం వైరల్ అయ్యి విద్యార్థులను అయోమయంలో పడేసింది. కొంతమంది ఆ సందేశాన్ని నిజమని నమ్మగా మరికొంతమంది మాత్రం నమ్మలేదు.
ఢిల్లీలోని ముఖర్జీ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్యలు తీవ్రతరమవుతూ ఉండటంతో రెస్టారెంట్లు, గ్రంథాయాలు, కోచింగ్ సెంటర్లు ఇతర విద్యాసంస్థలు జనవరి 2వ తేదీ వరకు మూసివేస్తున్నారని మెసేజ్ వైరల్ అయింది. విద్యార్థులు అందరూ హాస్టళ్లను ఖాళీ చేసి వారి సొంత ప్రాంతాలకు వెళ్లాలని అని మోడల్ టౌన్ ఏసీపీ అజయ్ కుమార్ చెప్పారని ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది. వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో ఈ మెసేజ్ వైరల్ అయింది.
ఫేక్ సందేశాలు వైరల్ అవుతూ ఉండటంపై నార్త్ వెస్ట్ జోన్ డీజీపీ విజయంత్ ఆర్య స్పందించారు. నకిలీ సందేశాలను గుర్తు తెలియని వ్యక్తులు వైరల్ చేస్తున్నట్టుగా భావిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని సమాచారాన్ని చేరవేశామని చెప్పారు. ఎవరు నకిలీ సందేశాలను పంపుతున్నారన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామని విజయంత్ ఆర్య తెలిపారు.
మరోవైపు పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టం గురించి ప్రజలు అనిశ్చితిలో ఉన్నారని ప్రజల మనస్సులు భయాందోళనతో నిండిపోయాయని అన్నారు. ఢిల్లీలో మాతమే కాకుండా దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఇది తనను తీవ్రంగా కలచివేస్తోందని అన్నారు. ముస్లింలు మాత్రమే కాకుండా హిందువులు, క్రైస్తవులు, సిక్కులు కూడా పౌరసత్వాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం వలన కేంద్రానికి ఒరిగేది లేదని కేజ్రీవాల్ అన్నారు.