తెలంగాణ రాష్ట్రంలో దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ అత్యాచారం, హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం విదితమే. దిశ ఘటన తరువాత దేశంలో, రాష్ట్రంలో అత్యాచారాల కేసులు తగ్గుతాయని పోలీసులు, ప్రజలు భావించినా భిన్నంగా రోజురోజుకు అత్యాచారాల ఘటనలు పెరిగిపోతున్నాయి. దిశ ఘటన మరవకమునుపే హైదరాబాద్ లో మరో దారుణం వెలుగుచూసింది.
 
జోగిపేట ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల బాలిక వేసవి సెలవులకు దూలపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఒక యువకుడు బాలికకు బంధువునవుతానంటూ పరిచయం చేసుకున్నాడు. కొన్ని రోజుల పరిచయం తరువాత బాలిక నంబర్ ను తీసుకొని తరచుగా ఫోన్ కాల్స్ చేసేవాడు. వేసవి సెలవుల తరువాత బాలిక తన ఇంటికి వెళ్లిపోయింది. బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో యువకుడు బాలిక ఇంటికి వెళ్లి తరచుగా అత్యాచారానికి పాల్పడేవాడు. 
 
రెండు రోజుల క్రితం యువకుడు బాలిక మొబైల్ కు ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఫోన్ బాలిక తల్లి లిఫ్ట్ చేసింది. ఆ విషయం తెలియని యువకుడు ఫోన్ లో అసభ్యకరంగా మాట్లాడాడు. బాలిక తల్లి బాలికను ఫోన్ కాల్ గురించి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే బాలిక కుటుంబ సభ్యులు షేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేశారు. షేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. 

పోలీసులు బాధిత బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని పిల్లలకు స్వేచ్ఛనివ్వటంతో పాటు వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఇలాంటి ఘటనలు జరగటానికి కారణమని పిల్లల పెంపకంలో జాగ్రత్త వహించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: