అమ్మఒడి.. జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకుంటున్న పథకం. బడికి వెళ్లే ప్రతి పిల్లవాడి కోసం ఏడాదికి 15 వేల రూపాయలు తల్లి ఖాతాలో వేస్తారు. దీని వల్ల పేదల్లో బడి మానేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఈ ఏడాది జనవరి నుంచే దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పడు ఈ కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది.

 

ఈ పథకం లబ్ధిదారుల తుది జాబితా ఖరారైంది. రాష్ట్రంలో మొత్తం 41 లక్షల 46 వేల 844 మంది విద్యార్థుల తల్లులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరి బ్యాంకు ఖాతాల్లో జనవరి 9న ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు. రాష్ట్రంలో 1 నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులు 81 లక్షల 70 వేల మంది ఉన్నారు. వీరిలో 65 లక్షల 10 వేల మందిని ఈ అమ్మ ఒడి పథకానికి అర్హులుగా గుర్తించారు. విద్యార్థుల వివరాలను తల్లుల ఆధార్ , రేషన్ కార్డులతో అనుసంధానం చేసి 41 లక్షల 46 వేల మంది లబ్ధిదారులతో తుది జాబితా రూపొందించారు.

 

అయితే.. బ్యాంకు ఖాతాల్లో పేర్లు తప్పుగా ఉండడం వల్ల లక్ష 84 వేల మంది అనర్హులయ్యారు. ఇంకా 14 లక్షల 70 వేల మంది వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించారు. ఎలాగంటే.. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్లు ఉండడం వల్ల వారికి అమ్మ ఒడి వర్తించదు. వీరితో పాటు తల్లి, విద్యార్థుల ఆధార్ వివరాల్లో తప్పులున్నవారు.. ప్రభుత్వం నిర్ణయించినదాని కన్నా ఎక్కువ స్థిరాస్తి ఉన్నవారికి పథకం వర్తించదు.

 

ఇంకొందరు ఈ పథకం తమకు అవసరం లేదని చెప్పారు కూడా. వీరందరూ పోగా మిగిలిన అర్హులకు జనవరి9 న ఖాతాల్లో సొమ్ము జమవుతుంది. మరి ఇంతకీ ఈ జాబితాలో మీ పేరు ఉందో తేదో చూసుకోండి.. మరి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: