పిల్లాపాపలతో కళకళలాడాల్సిన గ్రామాలు కిడ్నీ వ్యాధులతో మరణ మృదంగం మోగిస్తున్నాయి. గొంతు తడుపుకునేందుకు తాగుతున్న నీరు ప్రాణాల్ని హరిస్తోంది. ప్రకాశం జిల్లాలో సగానికిపైగా గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఏళ్లతరబడి ఫ్లోరైడ్ భారిన పడి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

 

ప్రకాశం జిల్లాని ఫ్లోరిన్ రక్కసి పట్టిపీడిస్తోంది. రక్షిత మంచి నీరు దొరక్క జనం విషం తాగు తున్నారు. యువకులు నుంచి వృద్ధుల వరకు భయంకరమైన కిడ్నీ వ్యాధి బారినపడి రాలిపోతున్నారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. కనిగిరి, మార్కాపురం, కంభం, ఎర్రగొండపాలెం, కంభం, గిద్దలూరు ప్రాంతాల్లో జనం సురక్షిత తాగు నీరు దొరక్క ఫ్లోరైడ్ నీరు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. తాగే నీటిలో ప్రమాదకరమైన స్ట్రాన్షియం, అర్సెనిక్ ఉంటున్నాయి. ఫ్లోరైడ్ భారిన పడి మరణానికి చేరువవుతామని తెలిసి కూడా ప్రజలు బోరు నీటిని తాగాల్సిన దుస్థితి నెలకొంది. ముప్పై ఏళ్ల వయస్సుకే కిడ్నీ వ్యాధులు వెంటాడుతున్నాయి. కిడ్నీ బాధితులు సర్కారు ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక అరకొర ఆస్తులు అమ్ముకుని ప్రైవేట్ హాస్పిటల్స్ బాటపడుతున్నారు.

 

ప్రకాశం జిల్లాలో రెండేళ్ల వ్యవధిలో 423 మంది కిడ్నీ వ్యాధులతో ప్రాణాలు కోల్పోగా మరో వెయ్యి మందికి పైగా హాస్పటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఫ్లోరిన్ భారిన పడిన గ్రామాలకు రక్షిత మంచి నీరు సరఫరా చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రకాశం జిల్లాలోని ఆ గ్రామాల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఆ నీళ్లు తాగితే చనిపోతామని తెలిసి కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఆ నీటిని తాగుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు ఇతర వ్యాధుల భారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: