మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. దేశమంతటా సంబరాలు అంబరాన్నంటేలా జరుగుతున్నాయి. ఈ ఉత్సాహం విషాదం కాకూడదని కోరుకుంటూ విందువినోదాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలీసులు కొత్త సంవత్సరం ఉత్సాహం ఎప్పటికీ గుర్తుండాలంటే కొన్ని నిబంధనలు పాటించి తీరాలని చెబుతున్నారు. మద్యం షాపులు, బార్లు, కాఫీ సెంటర్లు, రెస్టారెంట్లు ఇలా ప్రతి ఒక్కరు సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తున్నారు.
పోలీసులు గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. న్యూ ఇయర్ రోజున మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ యువత రోడ్డు ప్రమాదాలకు గురైనట్టు సర్వేలు చెబుతూ ఉండటంతో పోలీసులు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు కాఫీ షాపులు, రెస్టారెంట్లు, బార్, వైన్ నిర్వాహకులతో పలుమార్లు ఇప్పటికే సమావేశమయ్యారు.
నిబంధనల ప్రకారం వైన్ షాపులు, బార్లు రాత్రి ఒంటి గంట తరువాత సేవలు నిలిపివేయాలి. గతంలో ఈ విధానం కొనసాగించారు కాబట్టి ప్రస్తుతం కూడా ఈ నిబంధన కొనసాగే అవకాశం ఉంది. పార్టీ ప్రియులను కేక్ కటింగ్ పూర్తయిన తరువాత పరిసరాల నుండి పంపించివేయాలి. ప్రత్యేక అనుమతి కమిషనర్ నుండి తీసుకున్న బార్లు మాత్రమే రాత్రి ఒంటి గంట వరకు నడపాలి. బార్లు, వైన్ షాపులలోకి మైనర్లను ఎట్టి పరిస్థితులలోను అనుమతించకూడదు.
నిర్వాహకులు పార్టీకి వచ్చే వారు గొడవలు పడకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ సిబ్బందిని సమకూర్చుకోవడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీసులు జంక్షన్లు, బస్టాండ్లు, కూడళ్లపై ప్రధానంగా నిఘా పెడుతున్నారు. వాహనదారులు, ప్రజలు నిబంధనలను పాటించాలని సూచనలు చేస్తున్నారు. అతిగా మద్యం తాగి వాహనాలు నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రేపు రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.