కృష్ణా జిల్లా మైలవరంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల అనుచరుల మధ్య వాట్సాప్ లో మొదలైన వివాదం ఘర్షణకు దారి తీసింది. తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమ, వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ అనుచరులు పోటాపోటీగా వాట్సాప్ లో అనుచిత పోస్టులు చేశారు. ఈ విషయంపై గొడవ జరిగింది. వైసీపీ పార్టీ కార్యకర్త దుర్గాప్రసాద్ తన అనుచరులతో దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. 
 
వైసీపీ నేతల దాడిలో దేవినేని ఉమ అనుచరులు సుబానీ, బాలకృష్ణ, కరీం గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వీరు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేవినేని ఉమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనుచరులను పరామర్శించారు. వైసీపీ పార్టీ నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్లే తమపై దాడులు చేసి తాము చేశామని ఆరోపణలు చేశారని చెబుతున్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 
 
దేవినేని ఉమ, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలో కూడా వీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. రెండు నెలల క్రితం ఇసుక అక్రమ రవాణా విషయంలో దేవినేని ఉమా వైసీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయగా కృష్ణప్రసాద్ చౌకబారు వ్యాఖ్యలు చేస్తే తీవ్ర స్థాయిలో స్పందించాల్సి ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికలకు ముందు నుండే రాజకీయ వేడి మొదలైంది. తెలుగుదేశం పార్టీకి బాగా పట్టు ఉన్న నియోజకవర్గాలలో మైలవరం కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో దేవినేని ఉమా హవా కొనసాగుతున్న సమయంలో మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు వారసుడిగా వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో చేరి నియోజకవర్గ ఇంఛార్జీగా బాధ్యతలు చేపట్టి 2019 ఎన్నికల్లో దేవినేని ఉమా పై సంచలన 
విజయాన్ని నమోదు చేశారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: