మొత్తానికి చాలా కాలం తర్వాత గరుడ పురాణం ఆచూకి తెలిసింది. కలుగులో నుండి ఎలుక బయటకు వచ్చినట్లు గరుడపురాణం శివజి బయటకు వచ్చాడు. కేసుల విచారణకు హాజరుకాకుండా, అరెస్టుకు భయపడి చాలా కాలం పోలీసులకు, కోర్టుకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికాకు పారిపోయేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులకు దొరొకిపోయిన తర్వాత కూడా విచారణ నుండి తప్పించుకు తిరుగుతున్నారట.
ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని అండర్ టేకింగ్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసుల నోటీసులకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అలాంటి శివాజీ రాజధాని వివాదంలో ఎక్కడా కనబడటం లేదే అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికలకు ముందు వరకూ చంద్రబాబునాయుడుకు బలమైన మద్దతుదారుల్లో శివాజీ కూడా ఒకడు.
మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోవటంతో గరుడపురాణం కూడా అడ్రస్ దొరక్కుండా తప్పించుకుతిరుగుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా ఈ గరుడపురాణం గొంతే వినబడలేదు. ఎక్కడ కనిపిస్తే అరెస్టు చేస్తారో అన్న భయంతోనే అందరినీ తప్పించుకు తిరుగుతున్నారు. అయితే 20 రోజుల క్రితం జగన్ ప్రకటనతో మొదలైన రాజధాని తరలింపు విషయం ఎంతగా వివాదమైందో తెలిసిందే.
రాజధాని తరలింపు మీద ఇంత గొడవ జరుగుతున్న నేపధ్యంలో జగన్ కు వ్యతిరేకంగా తన గొంతు వినిపించలేకపోతున్నందుకు గరుడపురాణం తెగ బాధపడిపోతున్నారు. ఇక ఆ బాధను తట్టుకోలేక ఎల్లోమీడియా చానల్ లో ప్రత్యక్షమయ్యారు. దాదాపు 40 నిముషాల పాటు చంద్రబాబుకు మద్దతుగా జగన్ కు వ్యతిరేకంగా ఏదేదో మాట్లాడారు. కులాలన్నాడు, పార్టీలన్నాడు, అమరావతి రైతుల బాధ రాష్ట్రం మొత్తానికి చెందిన బాధగా చాలా చాలా మాట్లాడాడు.
అయితే ఎవరో కాలర్ శివాజి వ్యక్తిగతం గురించి మాట్లాడగానే అమ్మనాబూతులు మొదలుపెట్టి మొత్తం కార్యక్రమాన్ని రసాబాస చేసుకున్నాడు. సరే ఏదేమైనా మొత్తానికి గరుడపురాణం ఆచూకి అయితే బయటపడింది. గరుడపురాణం బాధ ఎన్నికలకు ముందు ఒకలాగుంటే ఎన్నికల తర్వాత మరోలాగ మారిపోయింది. చివరకు రాజధాని రగడతో ఇంకోలా మారుతోంది. రేపెలా ఉంటుందో చూడాల్సిందే.