ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు పలు కీలక శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ మున్సిపల్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అమ్మఒడి, విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 9వ తేదీన సీఎం జగన్ అమ్మఒడి పథకాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. అమ్మఒడి పథకం కొరకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 6,109 కోట్ల రూపాయలు విడుదల చేసింది.
 
ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఈ నెల 9వ తేదీన 15,000 రూపాయలు ఖాతాలలో జమ చేయనుంది. ప్రత్యేక సాఫ్ట్ వేర్ సహాయంతో అమ్మఒడి నగదు బ్యాంకు ఖాతాలకు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు సమాచారం. అమ్మఒడి పథకం ప్రారంభోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పిల్లలంతా బడికి వెళ్లాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 
 
1వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు పిల్లలను చదివిస్తున్న తల్లి ఖాతాలలో అమ్మఒడి నగదు జమ కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఈ పథకం వర్తించాలంటే విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వం ముందుగా ఒక్క రూపాయి ఖాతాలలో జమ చేసి ఆ తరువాత 15,000 రూపాయలు ఖాతాలలో జమ చేయనుంది. 
 
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమ్మఒడి పథకానికి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని చెప్పారు. అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలు అన్ని గ్రామాలు మరియు పాఠశాలలలో పెట్టినట్టు చెప్పారు. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, బ్యాంకు ఖాతాలను తనిఖీలు చేసిన తరువాతే అమ్మఒడి పథకానికి లబ్ధిదారులను గుర్తించామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. 5వ తేదీ సాయంత్రం వరకు గుర్తించిన లబ్ధిదారులు మాత్రమే అమ్మఒడి పథకానికి అర్హులు అవుతారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: