రాజధాని విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెనక ఉండి రైతులను రెచ్చగొడుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా, రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడనే విమర్శలు ఇప్పటికే ఎక్కువయ్యాయి. దీనికి తగ్గట్టుగానే అమరావతి ప్రాంతంలో భూములు భారీ ఎత్తున కొనుగోలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నాయకులు, టిడిపి నుంచి బిజెపి లోకి వెళ్లి నాయకులు దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధానిలో ఏర్పాటుపై జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా జీఎన్ రావు కమిటీని నియమించారు. వారిచ్చిన నివేదికలు ప్రస్తుతం ప్రభుత్వం వద్దకు చేరాయి. దీనిపై 20వ తేదీన తగిన నిర్ణయం హై పవర్ కమిటీ వెల్లడించబోతోంది. అయినా టిడిపి అదేపనిగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై వైసిపి ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పందించారు.
రాజధాని విషయంలో చంద్రబాబు కుట్ర బయటపడిందని, ఆయన ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు. ముఖ్యంగా బోస్టన్ కమిటీని అప్రతిష్ట పాలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు బీసీజీ వికీపీడియా ప్రొఫైల్ ఎడిట్ చేయించి జగన్ కు 50 శాతం వాటాలు ఉన్నాయంటూ ఎడిట్ చేయించారని, ఇప్పటికే ఈ సమాచారాన్ని 12 సార్లు మార్చే ప్రయత్నం చేశారని 'ది హిందూ దినపత్రిక' బయటపెట్టడంతో నువ్వు చంద్రబాబు పాతాళానికి జారిపోయావు బాబు అంటూ విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ లో కామెంట్ చేశారు. అలాగే దళిత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నారు.
దళితులు, బలహీన వర్గాలు అంటే మొదటి నుంచి చంద్రబాబుకు చిన్న చూపే అని విజయసాయి రెడ్డి విమర్శించారు. గతంలో ఎస్సీ , ఎస్టీలు గా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అంటూ కులాలను అవమానించావని, ఇప్పుడు ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ని దూషించడం చూస్తుంటే బాబులో మార్పు రాలేదని, వచ్చే అవకాశం కూడా లేదని అర్థమవుతోంది అంటూ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో చంద్రబాబుపై విమర్శలు చేశారు.