ఈ మధ్య కాలంలో దేశంలో రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పోలీసులు కూడా అత్యాచార ఘటనల విషయంలో సీరియస్ గా స్పందిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే ఫిర్యాదుకు స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసుకొని నిందితులకు శిక్ష పడేందుకు పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొందరు పోలీస్ వ్యవస్థతో, చట్టంతో ఆటలాడటానికి ప్రయత్నిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాకు చెందిన ఒక మహిళ తనపై 39 మంది అత్యాచారం చేశారంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఏకంగా ఎస్పీ కార్యాలయంలో 32 సంవత్సరాల వయస్సు గల మహిళ తను నివశించే గ్రామానికి చెందిన 39 మంది తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. 39 మంది అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు చేయటంతో ఈ ఫిర్యాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతటా సంచలనంగా మారింది.
ఎస్పీ వెంటనే బాధితురాలి గ్రామం ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ వివరాలను తెలుసుకొని అక్కడి పోలీసులను ఈ కేసు గురించి దర్యాప్తు చేయమని ఆదేశాలు జారీ చేశారు. మహిళ ఫిర్యాదు చేసిన విషయం ఆ గ్రామంలోని గ్రామస్తులకు తెలిసింది. వెంటనే గ్రామస్తులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని మహిళ తమపై తప్పుడు ఫిర్యాదు చేస్తోందని మహిళ తమపై ఫిర్యాదు చేయటానికి గల కారణాలను తెలిపారు.
గ్రామస్తులు మహిళ, మహిళ భర్త గ్రామంలోని కొందరు వ్యక్తుల నుండి రెండున్నర లక్షల రూపాయల అప్పు తీసుకున్నారని ఆ అప్పును తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయటం వలనే ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చెబుతున్నారు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని మహిళను వైద్య పరీక్షల కొరకు ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులతో ఎస్పీ మాట్లాడి సాక్ష్యాధారాలను సేకరిస్తున్నామని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత మహిళ ఫిర్యాదు తప్పు అని తేలితే మహిళపై చర్యలు తీసుకుంటామని
చెబుతున్నారు.