మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి జరిగిన నరసరావుపేట పర్యటనలో జగన్ పై, మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ తన పర్యటనలో రాజకీయాల గురించి, ఇతర పార్టీల నేతల గురించి మాట్లాడే చంద్రబాబు తన ఆహారపు అలవాట్ల గురించి మరియు వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించారు. జోలె పట్టి ఉద్యమం కొరకు విరాళాలు సేకరించిన అనంతరం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజధానికే సరిగ్గా దిక్కు లేదని కానీ జగన్ మాత్రం మూడు రాజధానులు కడతానని చెబుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గతంలో ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం వీడియో గేమ్స్ లో బిజీగా ఉన్నారని మంత్రులు కోడి పందేలు, ఎడ్ల పందేలు, టిక్ టాక్ లలో బిజీగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. అక్రమంగా పోలీసులు కేసులు పెడితే భయపడొద్దని ఎవరినైనా అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయాలని చంద్రబాబు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే రాజధాని కావాలని రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని ఉండాలని చంద్రబాబు చెప్పారు. అమరావతి రాజధానిగా ఉండాలని చేస్తున్న పోరాటం కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి కొరకు చేస్తున్న ఉద్యమం ఒక పార్టీదో లేక ఒక వ్యక్తిదో కాదని వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా ఫోన్ చేస్తే గుడ్ మార్నింగ్ అని చెప్పకుందా జై అమరావతి అని చెప్పాలని అన్నారు.
ప్రతి ఒక్కరి ఫోన్ లో జై అమరావతి అనే రింగ్ టోన్ వినపడాలని చంద్రబాబు సూచించారు. తన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు ఆరోగ్యం విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటున్నానని అన్నారు. ఇంకో 10 లేదా 15 సంవత్సరాలు మాత్రమే మహా అయితే తాను బతుకుతానని చంద్రబాబు అన్నారు. తానెప్పుడూ తప్పు చేయనని చట్టాన్ని గౌరవిస్తానని ఉద్యమాన్ని అణగదొక్కాలని, బెదిరించాలని చూస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరని చంద్రబాబు అన్నారు.