అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధానిని అమరావతి నుండి మార్చొద్దని చేస్తున్న ఆందోళన 27వ రోజుకు చేరింది. రాజధాని ప్రాంత రైతులు రోజురోజుకు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నివశించే స్థానికులు తమపై అనుచితంగా వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. 
 
పోలీసులకు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా అమరావతివాసులు వ్యవహరిస్తున్నారు. పోలీసులు వచ్చి షాపుల్లో ఏవైనా కొనుగోలు చేయాలని ప్రయత్నించినా షాపుల్లో పోలీసులు కొనుగోలు చేయటానికి వీలు లేకుండా వారికి క్రయవిక్రయాలను బంద్ చేశారు. హోటళ్లలో టీ, టిఫిన్, భోజనాలు కూడా పోలీసులకు అమ్మకుండా అమరావతివాసులు పోలీసులపై పగ తీర్చుకుంటున్నారు. 
 
ఆయిల్ ను బెంచీలపై పోసి పోలీసులు కూర్చోవడానికి కూడా వీలు లేకుండా రైతులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈరోజు హై పవర్ కమిటీ మూడోసారి సమావేశం కానుంది. హై పవర్ కమిటీ తొలి సమావేశంలో జీ.ఎన్.రావు, బీసీజీ కమిటీ నివేదికల గురించి చర్చించనుంది. హై పవర్ కమిటీ రెండో భేటీలో మూడు రాజధానుల గురించి, 13 జిల్లాల అభివృద్ధి గురించి, సచివాలయ ఉద్యోగుల పరిస్థితి గురించి రైతుల ఆందోళన మరియు డిమాండ్ల గురించి చర్చించింది. 
 
ఈరోజు జరుగుతున్న సమావేశంలో ప్రభుత్వ ప్రతిపాదనల గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సమావేశానికి ముందు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశం ఉండొచ్చని అన్నారు. హై పవర్ కమిటీ మరలా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల తరలింపు అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని అన్నారు. రాజధాని రైతుల విషయంలో ప్రభుత్వానికి సానుభూతి ఉందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: