ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. కానీ రాజధాని ప్రాంతంలోని పల్లెలు మాత్రం సంక్రాంతి పండుగ కళను కోల్పోయాయి. రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతిలో ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) ఉద్యమ సంక్రాంతికి పిలుపునిచ్చింది. జేఏసీ సంక్రాంతి పండుగను అమరావతి పండుగగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యమ సంక్రాంతి అంటూ ఉద్యమ కార్యాచరణను ఈ మేరకు జేఏసీ ప్రకటించింది.
ఈరోజు ఉదయం బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో బోగి మంటలు వేసి జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను కాల్చాలని కన్వీనర్ వి.ఆర్. స్వామి నిర్ణయం తీసుకొని అదే విధంగా చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు, కడప జిల్లాలలో కూడా నిరసనలు, ర్యాలీలు జరుగుతున్నాయి. జేఏసీ ఇకనుండి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెబుతోంది. అమరావతిలో రైతుల దీక్షకు ఇతర ప్రాంతాల ప్రజల నుండి మద్దతు పెరుగుతోంది.
ఈరోజు ఉదయం జేఏసీ ఆధ్వర్యంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై బోగి మంటల్లో నివేదికలను తగులబెట్టిన తరువాత జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు కష్టాల మధ్య ఈసారి సంక్రాంతి పండుగ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త కాబట్టే బీసీజీ, జీఎన్ రావు కమిటీల నివేదికలను కాల్చేశామని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని అవాస్తవాలు చెబుతోందని చంద్రబాబు అన్నారు.
ఇప్పటికే విశాఖ నగరం అభివృద్ధి చెందిందని రాజధానిని విశాఖకు తరలించటం వలన విశాఖకు ప్రత్యేకంగా ఎలాంటి లాభం చేకూరదని చంద్రబాబు అన్నారు. రాజధానిని తరలించటం వలన ఎలాంటి ప్రయోజనం చేకూరదని చంద్రబాబు ప్రభుత్వానికి సూచనలు చేశారు. జేఏసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం అమరావతి రైతుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ రైతులకు మేలు చేకూరేలా ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసిందని సమాచారం. కమిటీ ప్రతిపాదనలకు రైతులు అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది.