చంఢీగఢ్ లో హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక యువకుడు తాను చేసిన దారుణాన్ని లైవ్ టీవీ షోలో బయటపెట్టాడు. విషయం తెలిసిన పోలీసులు టీవీ ఛానెల్ కు చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. నిన్న చంఢీగఢ్ లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలలోకి వెళితే పోలీసులకు నూతన సంవత్సరం రోజున నర్సుగా పని చేసే సరబ్‌జీత్ కౌర్ అనే యువతి హత్యకు గురైనట్లు సమాచారం అందింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేయగా డిసెంబర్ నెల 30వ తేదీన సరబ్‌జీత్ కౌర్ హత్యకు గురైన హోటల్లో మణీందర్ అనే యువకుడు రూమ్ అద్దెకు తీసుకున్నట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. మణీందర్ ఏ రూమ్ ను అద్దెకు తీసుకున్నాడో అదే రూమ్ లో సరబ్‌జీత్ కౌర్ హత్యకు గురి కావడంతో పోలీసులు మణీందర్ హత్య చేసి ఉండవచ్చనే అనుమానంతో మణీందర్ కొరకు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
కానీ పోలీసులు గాలించినా మణీందర్ పోలీసులకు దొరకలేదు. నిన్న సాయంత్రం ఎవరూ ఊహించని విధంగా టీవీ ఛానెల్ కు వచ్చిన మణీందర్ లైవ్ లో షోలో తాను చేసిన దారుణాన్ని చెప్పాడు. సరబ్‌జీత్ కౌర్ ను తానే హత్య చేశానని సరబ్‌జీత్ కౌర్ తన గర్ల్ ఫ్రెండ్ అని ఆమె నర్సు వృత్తిలో పని చేసేదని చెప్పాడు. మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో సరబ్‌జీత్ కౌర్ ను హత్య చేసినట్టు మణీందర్ వెల్లడించాడు. 
 
పోలీసులకు సరబ్‌జీత్ కౌర్ హత్య కేసు నిందితుడు చానెల్లో ఉన్నట్టు సమాచారం అందటంతో వెంటనే ఛానల్ కార్యాలయానికి చేరుకొని మణీందర్ ను అరెస్ట్ చేశారు. మణీందర్ గతంలో కూడా ఒక యువతిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన మణీందర్ మరో దారుణానికి పాల్పడ్డాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: