తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లిలో ఒక మెడికో దారుణ హత్యకు గురయ్యాడు. విద్యార్థిని ఎవరో దారుణంగా హత్య చేసి బావిలో పడేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలలోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి వంశీ కాలేజీకు ఇంటి నుండి బయటకు వెళ్లి శవమై తేలాడు. స్వంత వ్యవసాయ భూమిలోనే వంశీ శవమై కనిపించటం గమనార్హం.
ప్రస్తుతం వంశీ ఖమ్మం జిల్లా మమత మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీకి వెళుతున్నానని చెప్పి బయటకు వెళ్లిన వంశీ శవమై కనిపించడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గుర్తు తెలియని దుండగులు కాళ్లు చేతులు కట్టేసి హత్య చేసిన అనంతరం బావిలో పడేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రేమ వ్యవహారమే వంశీ హత్యకు కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు ఉదయం గ్రామ శివారులోని సొంత బావిలో వంశీ శవమై కనిపించడంతో అతని తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. కాళ్లు చేతులు కట్టేసి ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసులు గ్రామంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
సంక్రాంతి పండుగ కోసం గ్రామానికి వచ్చిన వంశీ ఖమ్మంకు బయలుదేరి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుమ్మలపల్లి తిరుపతి - రమా దంపతులకు ఇద్దరు కుమారులు మరియు ఒక కూతురు ఉన్నారు. వంశీ రెండవ కుమారుడు కాగా హత్యకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వంశీ బ్యాగులో ఒక యువతికి సంబంధించిన డైరీ లభ్యమైందని సమాచారం.