రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు ఎలా ఉన్నా.. సమయానికి మాత్రం కలిసి రావాలి. లేకుండా పార్టీ పరువు.. పార్టీఅధినేత పరువు కూడా గంగపాలే అంటారు సీనియర్లు. ఇప్పుడు టీడీపీపరిస్థితి అలానే ఉంది. రాష్ట్రం లో మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ.. ముఖ్యంగా రాజధాని అమరావతిని డమ్మీ చేయడంపై రగిలి పోతూ.. టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. రైతులు సహా వివిధ సామాజిక వర్గాలను కూడగట్టి మరీ ఇక్కడ రాజకీయాలు చేస్తోంది. గడిచిన వారం రోజులుగా ఇక్కడ టీడీపీ ఆధ్వర్యంలో రైతులు , వివిధ సంఘాల నాయకులు కూడా కదం తొక్కుతున్నారు.
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సోమవారం ఇక్కడ పర్యటించి ధర్నాలు, నిరసనలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్‌పై నిప్పులు చెరిగారు. తమకు పేరు వస్తుందనే దుగ్ధతోనే జగన్ రాజధానిని మారుస్తు న్నారని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు. సరే! ఈ విషయాన్ని పక్కన పెడితే.. అసలు టీడీపీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా.. టీడీపీలో కీలకంగా ఉన్న రాజధాని ప్రాంతానికి చెందిన నాయకులు చాలా మంది మౌనం వహిస్తుండడమే ఇప్పుడు చర్చకు వస్తున్న ప్రధాన విషయం.
టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కానీ, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కానీ, నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కానీ ఎక్కడా కనిపించడంలేదు. పోనీ.. వీరు రాలేని పరిస్థితి ఉంటే.. ప్రెస్‌మీట్ పెట్టో.. ప్రకటన రూపంలోనో.. చంద్రబాబుకు మద్దతుగా ని లిచినా సరిపోతుంది. అయితే, అన్ని రూపాల్లోనూ వీరు మౌనం పాటించారు. రాజధానిలో ఇంత రగడ జరు గుతున్నా.. తమకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.
మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు ? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. గతంలో చంద్రబాబు వీరికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనో.. లేక తమకు ప్రత్యేకంగా ఎలాంటి గుర్తింపూ లేకుండా పోయిందనో.. లేక ఓ వర్గం ప్రయోజనాల కోసం తామెందుకు జగన్‌తో వైరం పెట్టుకోవాలనో వీరు సైలెంట్ అయిపోయారా ? లేక రాజధాని తరలించేందుకు వీరు పరోక్షంగా మద్దతిస్తున్నారా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో ఎప్పటికి స్పందిస్తారో చూడాలి.