2014 సంవత్సరంలో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏకంగా 33 వేల ఎకరాల భుసేకరణ చేశారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఎందుకు...? అనే విమర్శలు ఎదురైనా చంద్రబాబు మాత్రం ఆ విమర్శలను ఏ మాత్రం పట్టించుకోలేదు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ దందా కోసమే అంత భారీ స్థాయిలో భూములను సమీకరించాడని వార్తలు వినిపించాయి.
చంద్రబాబు, అతని సన్నిహితుల భూములను కాపాడుకునేందుకు ఆ భూములను సీఆర్డీఏ పరిధి నుండి తొలగించారని కూడా ఆరోపణలు వినిపించాయి. శివరామ కృష్ణన్ కమిటీకి 1500 ఎకరాలు అవసరమని చెప్పిన చంద్రబాబు 33వేల ఎకరాలు భూమిని సేకరించేలా చర్యలు చేపట్టారు. ఇప్పుడు కూడా రాజధానిని మార్చవద్దని చంద్రబాబు చేస్తున్న పోరాటం తన బినామీల భూముల విలువలను కాపాడుకోవడానికే రాజధానిగా అమరావతి ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలనే ఆలోచనతోనే అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో అమరావతిని నిర్మించటానికి లక్షా పది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని మాజీ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ స్వయంగా వెల్లడించారు. అప్పట్లో లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెప్పిన చంద్రబాబు మూడు రాజధానుల ప్రకటన తరువాత మాత్రం అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెబుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు తన భూముల విలువలు, పార్టీ నేతలు కొనుగోలు చేసిన వేల ఎకరాల భూములను కాపాడుకునేందుకే మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలపడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
40 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తే అభివృద్ధి జరుగుతుందనే విషయం బాగా తెలుసు. కానీ మూడు రాజధానుల ప్రకటన వలన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలనుకున్న తెలుగుదేశం పార్టీ నేతల ఆశలు అడియాశలు అవుతాయని భావించి చంద్రబాబు రాజధాని నిర్ణయానికి అనుకూలంగా ప్రకటన చేయడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు స్వార్థ రాజకీయ వలనే ఐదేళ్ల క్రితం రాజధానిగా అమరావతిని ప్రకటించినా అమరావతి అభివృద్ధికి నోచుకోలేదని వేల ఎకరాల భూముల సేకరణ వెనుక ఇప్పటికే కొన్ని వాస్తవాలు వెలుగులోకి రాగా పూర్తి స్థాయిలో నిజానిజాలు త్వరలో సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.