తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నో రాజకీయ విచిత్రాలు, సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. గతంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని టిఆర్ఎస్ ను ఈ స్థాయికి తీసుకువచ్చిన సీఎం కేసీఆర్ ప్రతి విషయంలోనూ ఆచితూచి, ముందడుగు వేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ ను భయపెట్టే రీతిలో కొన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హిందూత్వ ఎజెండా టిఆర్ఎస్ పార్టీలో కలవరం పుట్టిస్తోంది.
అదిలాబాద్, నిర్మల్, భైంసా, నిజామాబాద్, బోధన్, జహీరాబాద్, సంగారెడ్డి, కోరుట్ల, నల్గొండ, మిర్యాలగూడ పట్టణాల్లో అధిక సంఖ్యలో ప్రభావితం చేసే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎంఐఎం పార్టీ ఓట్లను చీల్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీలు మొదటి నుంచి ఒకరకమైన అవగాహనతో ముందుకు వెళ్తుండడంతో ఇప్పుడు కేసీఆర్ లో భయం పట్టుకుంది.
టిఆర్ఎస్- ఎంఐఎం పార్టీలు చీకటి మిత్రులని విషయం బయట అందరికి తెలిసిందే. దీనిపై తమ రాజకీయ ప్రత్యర్థులు అదేపనిగా ప్రచారం చేస్తుండడంతో ఆ దోస్తే కారణంగా హిందుత్వ ఓట్లను ఎక్కడ దూరం చేస్తుందో అన్న ఆందోళన, భయం టిఆర్ఎస్ పార్టీలో నెలకొంది. అది కాస్తా ఓటింగ్ పై ప్రభావం చూపిస్తుంది అని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారు.
ఇటీవల బైంసా లో జరిగిన హిందూ, ముస్లిం ల గొడవ, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనిపై మీడియా నియంత్రణ జరిగినా సోషల్ మీడియాలో మాత్రం టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని బిజెపి ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకుని హిందూ ఓట్లను టిఆర్ఎస్ కు దూరం చేసే విధంగా పావులు కదుపుతోంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ తో ఎంఐఎం పార్టీకి ఎటువంటి పొత్తు లేదని ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే బీజేపీ మాత్రం టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రెండు ఒక తానులో ముక్కలే అన్నట్టుగా ప్రచారం చేస్తోంది. అదీ కాకుండా ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కెసిఆర్ భేటీ అవ్వడాన్ని కూడా బిజెపి ప్రస్తావిస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఈ విధంగా తెలంగాణలో హిందుత్వ ఎజెండా కారణంగా, తమకు హిందువుల ఓట్లు ఎక్కడ దూరం అవుతాయో అన్న ఆందోళన టిఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది.