రాచరికపు హోదాలకు ప్రిన్స్ హ్యారీ దంపతులు గుడ్ బై చెప్పారు. అంతేకాదు ప్రజా నిధులను వదులుకునేందుకు అంగీకరించారు. రాజ కుటుంబం నుంచి వేరు పడుతున్నట్లు ప్రకటించిన హ్యారీ, మేగన్ లకు ఎప్పుడూ రాయల్ ఫ్యామిలీ నుంచి సహకారం ఉంటుందని క్వీన్ ఎలిజబెత్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రిన్స్ హ్యారీ, ప్రిన్సెస్ మెగన్ మార్కెల్ పూర్తిగా రాయల్ ఫ్యామిలీ నుంచి బయటకొచ్చేశారు. రాయల్ ఫ్యామిలీలో అన్ని పదవులనూ వదిలేసుకున్నారు. ఎలాంటి టైటిల్స్ లేకుండా సామాన్యుల్లా బతకనున్నారు. శనివారం ఈ మేరకు బకింగ్ హాం ప్యాలెస్ నుంచి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. క్వీన్ ఎలిజబెత్2 ఫ్యామిలీలో జరిగిన చర్చల వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు.
రాయల్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్లకు హిస్ రాయల్ హైనెస్, హర్ రాయల్ హైనెస్ టైటిల్స్ ఉంటాయి. మిలటరీ పదవుల దగ్గర్నుంచి, ప్రజలు కట్టే రాయల్ ట్యాక్స్ వరకు అన్నీ అనుభవిస్తారు. ఇప్పుడు ఆ పదవులు, సౌకర్యాలన్నింటికీ హ్యారీ దూరమవుతారు. గతంలో హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 1996లో ప్రిన్స్ చార్లెస్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత డయానా తన బిరుదులను వదులుకున్నారు.
ప్రిన్స్ హ్యారీ వేరు కాపురం పెట్టాక ప్రత్యేకంగా కట్టించుకున్న ఫ్రాగ్మోర్ కాటేజీకి ఖర్చయిన మొత్తాన్నీ తిరిగి చెల్లించేందుకు ఓకే చెప్పారు. దాని కోసం ఖర్చు చేసిన రూ.22.19 కోట్లతో పాటు, వాళ్లు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులకు కమర్షియల్ రెంట్ సుమారు రూ.3.32 కోట్లు చెల్లించేందుకు హ్యారీ, మెగన్లు సిద్ధమయ్యారు.
ఈ మేరకు ఓ లాంఛనప్రాయమైన అంగీకార ఒప్పందంపై వారు సంతకాలు చేశారు. మరికొన్ని వారాల్లో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఫలితంగా వీరికి ప్రభుత్వ నిధులు అందవు. రాజకుటుంబ సభ్యులుగా నిర్వర్తించాల్సిన విధులేవీ ఉండవు. ఇప్పటికే ఖరారై ఉన్న కొన్ని కార్యక్రమాల్లో మాత్రం వారు పాల్గొంటారు. కెనడాలో తమ వ్యక్తిగత జీవితాన్ని గడపనున్న ఈ దంపతులతో కొద్ది రోజులుగా బ్రిటన్ రాజకుటుంబీకులు చర్చలు జరుపుతున్నారు. స్వతంత్ర జీవితాన్ని గడపాలనుకునే వారి అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నానని క్వీన్ ఎలిజబెత్ కూడా ప్రకటించారు.
తాజా ఒప్పందం ప్రకారం ఈ జంట.. అధికారిక సైనిక బాధ్యతలు సహా రాచకుటుంబ విధులన్నింటి నుంచీ తప్పుకోనుంది. హ్యారీకి ప్రస్తుతం సైనిక బాధ్యతలు ఉన్నాయి. ఆయన రాయల్ మెరీన్స్ దళానికి కెప్టెన్ జనరల్ గా ఉన్నారు. వైమానిక దళంలో ఓ విభాగానికి గౌరవ ఎయిర్ కమాండెంట్ గా వ్యవహరిస్తున్నారు. చిన్నపడవలు, డైవింగ్ విధులకు కమోడోర్-ఇన్-చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. కామన్ వెల్త్ కు యువ రాయబారులుగా కూడా ఈ జంట ఉంది. ఈ బాధ్యతలనూ వారు కోల్పోనున్నారు. వ్యక్తిగత దాతృత్వ కార్యక్రమాల కొనసాగింపులో భాగంగా వారు రాణికి సంబంధించిన కామన్వెల్త్ ట్రస్టుకు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో కొనసాగుతారు.
ఈ జంట బ్రిటన్ లో కొంతకాలం, కెనడాలో కొంతకాలం ఉండాలనుకుంటోంది. ప్రస్తుతం బ్రిటన్ రాచ కుటుంబానికి ప్రభుత్వ ఖజానా నుంచి ఏటా 8.22 కోట్ల పౌండ్లు అందుతున్నాయి. దీన్ని సావరిన్ గ్రాంట్ అంటారు. తాజా ఒప్పందం అమల్లోకి వచ్చాక రాచరిక విధుల కోసం హ్యారీ దంపతులకు ప్రభుత్వ నిధులు అందవు.
ప్రిన్స్ హ్యారీ జంట తమ అధికారిక ససెక్స్ రాయల్ వెబ్సైట్లో ఈ విషయాలను ప్రకటించారు. కొత్త దాతృత్వ సంస్థను ప్రారంభించడం సహా లైఫ్ లో కొత్త ప్లాన్స్ అమలు చేయటానికి అడుగులు వేస్తామని ప్రకటించారు.