
తెలంగాణ రాజకీయాల్లో మజ్లిస్ పార్టీకి ఓ ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ కే దాని ప్రభావం పరిమితమైనా ఆ పార్టీ నేతలకు క్రేజ్ ఉంది. అందులోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచి ఆ పార్టీతో బాగా దోస్తీ చేస్తున్నారు. ఒవైసీ బ్రదర్స్ కు కేసీఆర్ మంచి గౌరవం ఇస్తారు. ఒవైసీలు కూడా కేసీఆర్ ను మంచి దోస్త్ లా చూస్తారు. అందుకే ఎన్నికల్లోనూ ఆ పార్టీ మధ్య స్నేహపూర్వక పోటీలు.. అవగాహన ఉంటాయి.
అయితే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం.. ఈ రెండు పార్టీలు ఇప్పుడు కత్తులు దూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.అందుకే ఈ పార్టీల నేతల మధ్య మాటల బాంబులు బాగా పేలుతున్నాయి. ఎప్పుడూ కేసీఆర్ ను గౌరవించే మాట్లాడే ఒవైసీలు కూడా కేసీఆర్.. మీ వాళ్లను అదుపులో పెట్టుకో అంటూ పరుషంగా స్పందిస్తున్నారు.
‘ఖబడ్దార్.. టీఆర్ఎస్ ఖబడ్దార్..!’ అంటూ మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు నోరు అదుపులో పెట్టుకోండి.. లేదంటే మేం నోరు తెరుస్తాం.. మేం నోరు తెరిస్తే, మీరు బయట తిరగలేరు’ అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ గులాబీ నేతలపై విరుచుకుపడ్డారు. ‘కేసీఆర్ గారూ.. కేటీఆర్ గారూ.. మీ వాళ్లను అదుపులో పెట్టండి’ అని సలహా ఇచ్చారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో అక్బరుద్దీన్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌పై మండిపడ్డారు. ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోతున్నవాళ్లు మా గురించి మాట్లాడుతున్నారు. మేం ఐదుసార్లు గెలిచాం. మజ్లిస్ ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాదు. మీరు పొరుగు తెలుగు రాష్ట్రం నుంచి విజయం సాధించగలరా? అని నిలదీశారు.
అంతేకాదు.. సికింద్రాబాద్‌లో తన కొడుకును గెలిపించుకోలేని తలసాని కూడా మజ్లిస్ పై అనవసర విమర్శలు చేస్తున్నారని కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్ సెక్యులర్‌గా వ్యవహరిస్తున్నారని.. దేశంలో మాత్రం చాయ్‌వాలాకు అధికారం ఇస్తే, సొంత జాగీర్గా వ్యవహరిస్తున్నారని మోడీపై మండిపడ్డారు అంతా నన్ను షేర్ అంటుంటారు. కానీ నేను యువతను షేర్లుగా తయారు చేస్తానంటూ యూత్ లో ఉత్సాహం నింపారు.